మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్ మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సులను కేంద్రం ఆమోదించి గెజిట్ జారీ చేసింది. జస్టిస్ బట్టు దేవానంద్ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే న్యాయమూర్తిగా ఉన్నారు. అయితే తర్వాత బదిలీల్లో భాగంగా మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయనకు సొంత రాష్ట్రంలో అవకాశం లభించింది.
జస్టిస్ బట్టు దేవానంద్ 1966లో కృష్ణా జిల్లా, గుడివాడ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విద్యాభ్యాసం అంతా గుడివాడలోనే జరిగింది. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుండి న్యాయవాద విద్య పూర్తి చేశారు. 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, 2014 నుండి 2019 వరకు గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా ప్రో బోనో కేసులను వాదించారు.
జనవరి 13, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022లో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు మేరకు మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో ఆయన బదిలీ రద్దు చేయాలని న్యాయవాదులు ధర్నాలు చేశారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేకత నిర్ణయాలపై నిర్మోహమాటంగా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ గుర్తింపు పొందారు.