ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌గా జస్టిస్ లిసాగిల్ ప్రమాణం చేశారు. పంజాబ్ & హర్యానా హైకోర్టు నుండి బదిలీపై వచ్చిన జస్టిస్ లిసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. చండీగఢ్‌కు చెందిన జస్టిస్ గిల్ పంజాబ్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన లిసా గిల్ సివిల్, క్రిమినల్ మరియు రాజ్యాంగపరమైన కేసుల్లో అపారమైన అనుభవం గడించారు. 2014లో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైన ఆమె, తన నిష్పాక్షికమైన తీర్పులతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో సీనియారిటీ ప్రాతిపదికన జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించబోయే మొదటి మహిళా న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, జస్టిస్ లిసా గిల్ రాక ఏపీ హైకోర్టుకు కొత్త జవజీవాలను ఇస్తుందని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. అపారమైన అనుభవం, చట్టంపై పట్టున్న ఆమె నాయకత్వంలో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఆమె నియామకం ద్వారా ఏపీ న్యాయవ్యవస్థలో ఒక మహిళా శక్తి కీలక పాత్ర పోషించబోతుండటం విశేషం.


