అదృష్టం, దురదృష్టం, కష్టపడి సక్సెస్ సాధించడం, అనుకోకుండా అవకాశం వచ్చి అందలమెక్కేయడం లాంటివన్నీ సినిమా రచయితలు రాసే కథలలో ఎలా ఉంటాయో సినిమా పరిశ్రమ వ్యక్తుల జీవితాలలో అంతకుమించే ఉంటాయి. సినిమా వాళ్ళ నిజ జీవితాల్లో ఉండే డ్రామా, ఎమోషన్స్, ట్విస్ట్స్ అన్నీ కూడా సినిమాల కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి. సినిమా వాళ్ళ జీవితాలకు సంబంధించిన నిజాలను స్టడీ చేస్తే బోలెడంత జీవితసారం కూడా మనకు బోధపడుతుంది.
ఈ తరం హీరోలు నాని, రాజ్తరుణ్లిద్దరూ కూడా డైరెక్టర్స్ అవుదామన్న లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా జాబ్ చేస్తూ ఆ సినిమా సీన్స్‌లో ఆర్టిస్టులు ఎలా యాక్ట్ చేయాలో వాళ్ళకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఆర్టిస్ట్‌ల కంటే కూడా నాని, రాజ్‌తరుణ్‌ల యాక్టింగే బాగుందని ఫీలయిన డైరెక్టర్స్….ఆ సినిమాలలో హీరో అవకాశాలను నాని, రాజ్‌తరుణ్‌లకు ఇచ్చేశారు. అయితే ఇలాంటి అవకాశమే ది బెస్ట్ డైరెక్టర్ కె. విశ్వనాథ్‌కి ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే వచ్చిందట. తేనేమనసులు సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేశారు కె.విశ్వనాథ్. ఆ సినిమాను పూర్తిగా కొత్తవాళ్ళతో, కలర్లో తీయాలని డెసిషన్ తీసుకున్నారు డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు. అయితే కొత్త వాళ్ళెవ్వరి యాక్టింగ్ కూడా ఆదుర్తిగారికి నచ్చడం లేదట. అప్పుడే ఆయన వేరేవాళ్ళతో ఒక మాట అన్నారట. ‘ఇంకొంత కాలం చూద్దాం…సరైన హీరో ఎవరూ దొరక్కపోతే మన విశ్వం(కె.విశ్వనాథ్)నే హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం…’ అని అన్నారట. ఆ తర్వాత కృష్ణగారు హీరోగా సెలక్ట్ అయిపోయారుగానీ లేకపోతే విశ్వనాథ్ హీరోగా ‘తేనెమనసులు’ సినిమా తెరకెక్కి ఉండేదేమో. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఎన్నో పాత్రలకు జీవం పోశారు విశ్వనాథ్. ఇక హీరో కూడా అయి ఉంటే కమల్ హాసన్ రేంజ్లో ఉండేదేమో వ్యవహారం. అయితే సాగరసంగమం, శంకరాభరణంలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రరాజాలను మాత్రం మనం మిస్సయ్యి ఉండేవాళ్ళం. అందుకే కళామతల్లి కూడా విశ్వనాథ్‌కి డైరెక్టర్‌గానే అవకాశాలు ఇచ్చి ఉంటుంది. ఆయన కూడా వేరే ఏ డైరెక్టర్‌కి కూడా సాధ్యం కాని స్థాయిలో సంగీతాన్ని కథా వస్తువుగా తీసుకుని అజరామరంగా నిలిచిపోయే ఆణిముత్యం లాంటి సినిమాలతో ఆబాలగోపాలాన్ని అలరించారు. హ్యాట్సాఫ్ టు విశ్వనాథ్‌గారు.