దుల్కర్ సల్మాన్ ఒక కథని ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా విషయం ఉంటుందని నమ్మకం. అందులో రానా నిర్మాతగా చేరాడంటే… ఇంకా స్పెషల్. కాంత సినిమా కూడా ఇలానే ఆశలు రేపుతోంది. దుల్కర్ హీరోగా రానాతో కలసి నిర్మిస్తున్న సినిమా ఇది. భాగ్యశ్రీ హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు.
టీజర్ గమ్మత్తుగా ఉంది. బాలచందర్, కమల్ హాసన్ ట్రాక్‌ని గుర్తుకు తెచ్చే ఒక వెటరన్ దర్శకుడు, స్టార్ హీరో కథ ఇది. సినిమాలోనే ఒక సినిమా ఉంది. హీరో చంద్రన్, దర్శకుడు అయ్యా కెరీర్ ఆరంభంలో గొప్ప ఆత్మీయులు. నటనలో ఓనమాలు అయ్యా వద్దే నేర్చుకుంటాడు చంద్రన్. అయితే క్రమంగా పేరు, ప్రఖ్యాతులు వచ్చేసరికి వీరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ దశలో దర్శకుడు అయ్యా ఫీమేల్ లీడ్‌గా ఒక హారర్ ఫిల్మ్ తీస్తాడు. దానికి శాంత అనే టైటిల్ పెడతాడు. చంద్రన్ ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతను తన ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌లో వేలుపెడతాడు. శాంత టైటిల్‌ని కాంత మార్చేస్తాడు. తర్వాత ఏమిటనేది కథ.
1950 మద్రాస్ నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఎదో యూనిక్‌గానే ప్లాన్ చేశాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే పాత్రలో ఒదిగిపోయాడు. వింటేజ్ వాతావరణాన్ని బాగా క్రియేట్ చేశారు. సినిమా చూడాలనే ఆసక్తిని ఈ టీజర్ క్రియేట్ చేయగలిగింది. సెప్టెంబర్ 12న కాంత ప్రేక్షకుల ముందుకు వస్తోంది.