కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హతా వేటు వేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మేలో ఆయనపై అనర్హతా వేటు వేసినా..కోర్టుకు వెళ్లి మళ్లీ వాదన వినిపించుకునేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆయన చేసిన వాదనలకు ఆధారాల్లేవని ఆయన నిబంధనలు ఉల్లంగించారని తేల్చిన పురపాలక శాఖ మరోసారి అనర్హతా వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మేయర్ పీఠాన్ని అడ్డం పెట్టుకుని సొంత కుటుంబానికి కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు అక్రమంగా టెండర్లు పొందినట్లుగా తేలడంతో ఎన్ని సార్లు వివరణ అడిగినా పట్టించుకోలేదు. చివరికి తన కుటుంబసభ్యులు కాంట్రాక్టులు చేసినట్లుగా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని ప్రభుత్వం అనర్హతా వేటు వేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా సమర్థించింది. అయితే డివిజనల్ బెంచ్ కు వెళ్లి తన వాదన మరోసారి వినాలని స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే వాదన వినిపించారు. ఆయన తప్పు చేసినట్లుగా తేలడంతో అనర్హతా వేటు వేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారమే ఇలా చేయడంతో ఇప్పుడు ఆయనకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గం.
కడపను అడ్డాగా చేసుకుని చేసిన అరాచకమే ఇప్పుడు ఆయన పదవి పోవడానికి కారణం అయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడప మేయర్ సీటు పక్కన కడప ఎమ్మెల్యేకు సీటు వేసేవారు. మేయర్ పక్కనే కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ భాషా కూర్చునేవారు. ఆయన హాజరు కాకపోయినా ఆ కుర్చీ మాత్రం వేసేవారు. ప్రభుత్వం మారిన తర్వాత కడప మేయర్ ఆ సంప్రదాయాన్ని పాటించ లేదు. కడప ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి మాధవి గెలవడంతో ఆమెకు ఆ గౌరవం ఇవ్వలేదు. ఈ అంశంపై గొడవలు అయ్యాయి. చివరికి ఆయన కుర్చీకే ఎసరు వచ్చింది.
