కడప జిల్లా రివ్యూ : వైసీపీ దూకుడును టీడీపీ నిలువరించగలుగుతుందా..?

ysrcp

కడప జిల్లా అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వైఎస్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీకి … జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీకి .. పెట్టని కోటలా.. జిల్లా మారింది. వైఎస్ చనిపోయిన తర్వాత సెంటిమెంట్ జిల్లా మొత్తం ఉంది. అది గత ఎన్నికల వరకూ పని చేసింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఉందా లేదా అన్నదానిపై… చర్చలు జరుగుతున్నాయి.

గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంలో టీడీపీ..!

టీడీపీ తొలిజాబితా ప్రకటించింది. ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టిక్కెట్ల కోసం పోటీ ఉన్న ప్రొద్దుటూరు, కడప, రైల్వేకోడూరు అభ్యర్థులను పెండింగ్ పెట్టారు. రాజంపేట నుంచి బత్యాల చెంగల్రాయులు, రాయచోటి నుంచి ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి, మైదుకూరు నుంచి టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, కమలాపురం పుత్తానర్శింహారెడ్డి, జమ్మలమడుగుకు రామసుబ్బారెడ్డి, పులివెందులకు సతీష్‌రెడ్డిని, బద్వేలు నుంచి రాజశేఖర్‌ను టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. కడప లోక్‌సభకు మొదటినుంచి అనుకుంటున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నారు. నిజానికి గత రెండు, మూడు ఎన్నికల్లో లేనంత నమ్మకాన్ని … టీడీపీ చూపిస్తోంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడంతో… ఆ ఎఫెక్ట్ జిల్లా మొత్తం కనిపిస్తోందని టీడీపీ భావిస్తోంది. పార్లమెట్ బరిలో ఆదినారాయణ రెడ్డి ఉండటం.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను తీసుకోవడంతో… టీడీపీ నేతలు.. ఈ సారి .. వైసీపీపై తమదే పైచేయి అని చెబుతున్నారు.

వైఎస్ పై నమ్మకాన్ని ప్రజలు జగన్‌పై ఉంచుతారా..?

వ్యవహారశైలిలో .. వైఎస్‌కు భిన్నంగా ఉన్న జగన్ తీరు వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డితో… అసలు విబేధాలు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన … తన నియోజకవర్గంలో.. పాతుకుపోయారనో… పక్క నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపిస్తున్నారన్న కారణంగా ఏమో కానీ.. ఆయనను మెల్లగా దూరం చేసుకున్నారు. ఆయన టీడీపీలో చేరి ఇప్పుడు జగన్ నే సవాల్ చేస్తున్నారు. పులివెందుల సతీష్ రెడ్డి, బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్ సహా.. టీడీపీకి కమిటెడ్ లీడర్లు ఉండటం కలసి వస్తోంది. అదే కాకుండా… గత ఐదేళ్ల కాలంలో… కడప జిల్లాకు.. కృష్ణానీరును పుష్కలంగా అందించారు. అది.. చాలా మందిలో మార్పు తెచ్చిందని టీడీపీ నమ్ముతోంది. ఇక సంక్షేమ పథకాల ప్రభావం కూడా.. భారీగా ఉందని టీడీపీ అనుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో… వివేకానందరెడ్డి ఓడిపోవడం వైసీపీకి మైనస్ పాయింట్. ఆ తర్వాత కూడా జగన్ తీరులో మార్పు రాలేదు. జగన్ తీరునే అడ్వాంటేజ్ చేసుకుని.. టీడీపీ మెజార్టీ సీట్లు సాధించాలని.. వైఎస్ కుటుంబం ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది.

అభిమానమే వైసీపీ బలం..!

వైసీపీ తరపున, వైఎస్ కుటుంబం కోసం కష్టపడే నేతలు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో కొంత అసంతృప్తి ఉంది. రాజంపేట నుంచి మేడా మల్లికార్జున్‌ పార్టీలోకి రాగానే టిక్కెట్ ఇచ్చారు. పైకి చెప్పకపోయినా.. ఆయనను ఓడించేందుకు అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ నేత అమరనాథ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. , జమ్మలమడుగు నుంచి డాక్టర్‌ సుధీర్‌ పోటీ చేస్తారు. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారు. కానీ గత ఎన్నికల సమయంలో… ముస్లింలు సహా పలు వర్గాలకు అనేక హామీలిచ్చారు. అవేమీ నెరవేర్చకపోవడంతో.. ఇప్పుడు.. క్యాడర్ కూడా.. అదే అసంతృప్తిలో ఉంది. పైగా… ఏ రాజకీయ ప్రయోజనం కలిగినా… వైఎస్ కుటుంబానికి చెందిన వారే అనుభవిస్తూండటంతో.. ద్వితీయ శ్రేణి నేతలు..కొంత అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ.. వైఎస్ పై అభిమానమే వైసీపీకి బలం.

జనసేన కూడా ఇద్దరి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజంపేట నుంచి పత్తిపాటి కుసుమకుమారి, రైల్వే కోడూరు నుంచి బి.వెంకటసుబ్బయ్య పేర్లను జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ ఒకటి రెండురోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నాయి. అయితే.. ఈ పార్టీల పోటీ నామమాత్రమే అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com