వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని నల్లలింగాయపల్లి గ్రామస్తులు శుక్రవారం భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తమ విలువైన భూములను త్యాగం చేసినప్పటికీ, యాజమాన్యం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా, నేటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని, ఫ్యాక్టరీ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
భూసేకరణ సమయంలో ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం స్థానికులకు కాకుండా బయటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తమ భూముల్లో వెలిసిన పరిశ్రమలో తమకే పని లేకుండా పోయిందని, ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన గ్రామస్తులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనతో ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. తమకు తక్షణమే న్యాయం జరగకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
