కాళేశ్వరం విషయంలో ఏం చేయాలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయినట్లుగా కనిపిస్తోంది. రాజకీయ నేతల్ని విచారించకుండానే అధికారుల విచారణ, సాక్ష్యాధారాల పరిశీలనతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చేస్తుందని అనుకున్నారు. ఈ మేరకు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ అలాంటి అవకాశం లేదని తాజాగా తేలిపోయింది. కమిషన్ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని తాము అధికారంలోకి రాగానే విచారణ చేయించి అవినీతి చేసిందంతా కక్కిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. దానికి తగ్గట్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ ఇప్పటి వరకూ అధికారుల్ని ప్రశ్నించింది. డాక్యుమెంట్లను పరిశీలించింది. ప్రాథమిక రిపోర్టును రెడీ చేశారని.. ఎప్పుడైనా సమర్పించవచ్చని అనుకున్నారు.
కేసీఆర్, హరీష్, ఈటల వంటి వారికి సమన్లు ఇచ్చి ప్రశ్నిస్తారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు.. రాజకీయ నేతల్ని ప్రశ్నించకూడదని అనుకున్నారని.. కానీ వారు చేసిన తప్పుల్ని మాత్రం.. వెల్లడిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కమిషన్ పదవి కాలాన్ని రెండు నెలల పాటు పొడిగించడంతో .. మళ్లీ వాళ్లను పిలిపించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.