కాళేశ్వరం కమిషన్ అవకతవకలపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన పని పూర్తి చేసింది. సీల్డ్ కవర్ లో నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి తదుపరి చర్యలను ఖరారు చేస్తారు.
ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. దాంతో కాళేశ్వరంలో అవకతవకలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మొదట విజిలెన్స్ దర్యాప్తు నిర్వహించారు. అందులో తీవ్రమైన అక్రమాలు వెలుగు చూడటంతో.. మొత్తం సమగ్రంగా విచారణ జరిపేందుకు సుప్రీంకర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఓ సారి కమిషన్ గడువును పొడిగించారు. చివరి రోజున నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలక పాత్ర పోషించిన అందర్నీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. కేసీఆర్ , హరీష్ రావులను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వ రికార్డులతో సహా అన్నింటినీ సమగ్ర పరిశీలన చేసి అక్రమాలపై నివేదిక రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. నివేదికను చర్చించిన తర్వాత కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.