కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభ సాక్షిగా ప్రకటించడం బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును కూలేశ్వరం అని అభివర్ణిస్తూ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో బలాన్ని చేకూర్చాయి. తమ గర్వకారణంగా చెప్పుకున్న ప్రాజెక్టుపై ఏకంగా కేంద్రమే ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీపై ఎదురుదాడికి దిగడంలో వెనుకబడి ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ప్రతిపక్షాల నుంచి చిన్న విమర్శ వచ్చినా మూకుమ్మడిగా విరుచుకుపడే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, సీఆర్ పాటిల్ వ్యాఖ్యల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటించే బదులు, రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులను, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న మైనింగ్ ఆరోపణలను ఎత్తిచూపడానికే ప్రాధాన్యతనిస్తోంది. దీనివల్ల కాళేశ్వరం చర్చను పక్కదారి పట్టించి, రాష్ట్రస్థాయి అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలనేది గులాబీ దళం వ్యూహంగా కనిపిస్తోంది.
ప్రస్తుతానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ హడావుడి చేస్తున్న బీఆర్ఎస్, కాళేశ్వరంపై కేంద్రం చేసిన వృథా వ్యాఖ్యలకు సాంకేతిక ఆధారాలతో సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపించడంలేదు. కేంద్రం-రాష్ట్రం మధ్య నలుగుతున్న కాళేశ్వరం ఇష్యూలో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి పాత అంశాలనే హైలైట్ చేస్తూ, అసలు చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరో అస్త్రం లభించినట్లయింది. లక్ష కోట్ల నష్టపర్చిన ప్రాజెక్టుపై అవకతవకతల కోసం సీబీఐ విచారణ జరిపించాలని సిఫారసు చేసినా.. ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన బీజేపీని ప్రశ్నించే అవకాశం ఉంది.
