“తిప్పిపోతల” ప్రచార ఎజెండాతో టీ కాంగ్రెస్..!

గోదావరికి వచ్చిన వరదలతో.. తెలంగాణలో కొత్త రాజకీయం రాజుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నిధుల వృధా తప్ప.. మరేం ప్రయోజనం లేదంటున్న కాంగ్రెస్ …. మొన్నటి రివర్స్ పంపింగ్ వ్యవహారంతో ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన సాక్ష్యం సంపాదించుకుంది. ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. రీ డిజైన్ వల్ల జరిగిన నష్టాన్ని…ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో రూ. 38 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రీ డిజైన్ చేశారు. తమ్మిడిహట్టి వద్ద నిర్మాణాన్ని పక్కన పెట్టి మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని కాంగ్రెస్ వాదిస్తోంది.

తమ్మిడిహట్టి వద్ద నిర్మాణాన్ని పక్కన పెట్టడం వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు సోమవారం నుంచి టీకాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయికి వెళ్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాకు సైతం నీరు అందించేలా డిజైన్ చేశారు. కానీ టిఆర్ఎస్ రీ డిజైన్ వల్ల ఆ అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రద్దు చేసినందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దీన్ని లీడ్ చే్యబోతున్నారు.

వలసలతో.. కుదలయిపోతున్న కాంగ్రెస్ పార్టీ… ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుని.. లైవ్‌లో ఉండాలని కోరుకుంటోంది. నేతలు ఎవరికి వారే.. సొంత కార్యాచరణ రెడీ చేసుకున్నా… పర్వాలేదు కానీ..ఏదో ఓ కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆయన ఉదయ సముద్రం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నేతలు.. ప్రాణహిత – చేవెళ్లను… టార్గెట్ చేసుకున్నారు. మొత్తానికి… ఏదో ఓ సబ్జెక్ట్ తో ప్రజల్లో ఉండాలని మాత్రం టీ కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com