కాళేశ్వరంకి జాతీయ హోదా వద్దు : ఆంధ్ర ప్రభుత్వం

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి.. అక్కడి శిలాఫలకంపై.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తన పేరు చూసుకుని సంతోషపడి… కేసీఆర్ ఇచ్చిన అత్యంత ఖరీదైన వెండి జ్ఞాపికను తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అసలు చిక్కులు ప్రారంభం కాబోతున్నాయి. జగన్ తీరును ఆసరా చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రాజెక్టుపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి సానుకూలతనే ప్రత్యక్ష సాక్ష్యంగాచూపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఢిల్లీలో గుట్టుగా ఈ వ్యవహారాలు సాగిపోతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా గమనించారో… లేక కేసీఆర్‌తో.. సఖ్యత తగ్గిపోయిందేమో కానీ… కాళేశ్వరంకు.. జాతీయ హోదా ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

విభజన హామీల విషయంలో… పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి.. ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులోనే… కాళేశ్వరం విషయంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని కౌంటర్‌లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని పేర్కొంది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదంది. రీఇంజినీరింగ్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు చెబుతోంది. ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టే. తెలంగాణ నూతన ప్రాజెక్టుల వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఏపీ సర్కార్ వాదిస్తోంది. ఒక్క కాళేశ్వరంనే కాదు.. తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టులు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ వాదనలు గత ప్రభుత్వం వినిపించినవే. కానీ.. ఇప్పుడు.. కాళేస్వరంపై ఇంత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు .. కానీ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. కాళేశ్వరంపై అభ్యంతరాల్లేవని.. ఓ ముఖ్యమంత్రి దీని ద్వారా సందేశం ఇచ్చారు. తెలంగాణ సర్కార్ కు ఇంత కంటే గొప్ప ఆయుధం ఇంకేమీ ఉండదు. రేపు సమర్థించుకోవడావికి జగన్మోహన్ రెడ్డికీ అవకాశం ఉండదు. అందుకే.. ముందు ముందు ఏపీ సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయం… చర్చనీయాంశం కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com