‘దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌’తో పోలికా.. కాస్త ఓవ‌ర్ అవ్వ‌లేదూ…!

జైల‌వ‌కుశ‌… ఈ టైటిల్‌ని మ‌ళ్లీ ఎంచుకోవ‌డ‌మే అత్యంత సాహ‌సం. ఆ సాహ‌సం చేశాడు ఎన్టీఆర్. అక్క‌డితో ఆగ‌లేదు. మూడు పాత్ర‌లు చేశాడు. అంత‌టితో స‌రిపెట్టుకోలేదు. అందులో ఒక‌టి విల‌న్‌. ఇంకా సంతృప్తి ప‌డ‌లేదు.. న‌త్తి.. న‌త్తిగా డైలాగులు చెప్ప‌డం మొద‌లెట్టాడు. ఓ విధంగా.. ఎన్టీఆర్ త‌న కెరీర్లో చేస్తున్న అత్యంత సాహ‌సోపేత‌మైన సినిమా ఇదే కావొచ్చు. ఇలాంటి స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. అంచ‌నాలేమాత్రం పెర‌గినా దాన్ని అందుకోవ‌డం చాలా క‌ష్టం. ఇప్ప‌టికే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని ఓ రేంజులో ఊహిస్తున్నారు. వాళ్ల అంచ‌నాల‌కు ద‌గ్గర‌గా ఈ సినిమాని తీసుకెళ్ల‌డం త‌ల‌కు మించిన ప‌ని. దాన్ని కంట్రోల్ చేయ‌డం ప‌క్క‌నుంచి.. ఆ అంచ‌నాల భారం మ‌రింత పెంచేలా మాట్లాడేశాడు క‌ల్యాణ్ రామ్‌.

జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ విడుద‌ల‌లో క‌ల్యాణ్‌రామ్ స్పీచ్ అంద‌రినీ ఆక‌ట్టుకొంది. మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి అభిమానుల్ని. త‌మ్ముడిపై త‌న‌కున్న ప్రేమ అక్ష‌రాలా చాటుకొన్నాడు. ఈ సినిమాపై న‌మ్మ‌కాన్ని మాట‌ల్లో వ్య‌క్త‌ప‌రిచాడు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. కాక‌పోతే ఈ సినిమాని అప్ప‌టి దాన‌వీర శూర‌కర్ణ‌తో పోల్చాడు క‌ల్యాణ్ రామ్‌. తాత‌య్య సినిమా కాబ‌ట్టి, ఇందులోనూ మూడు పాత్ర‌లు ఉన్నాయి కాబ‌ట్టి అలా పోల్చి చూసే హ‌క్కు నంద‌మూరి వార‌సుడిగా క‌ల్యాణ్ రామ్‌కి ఉండొచ్చు గాక‌. ఓ నిర్మాత‌గా ఈ సినిమాని ఆ రేంజులో ఊహించుకోవ‌డం కూడా త‌ప్పేం కాదు. కానీ.. అభిమానుల అంచ‌నాల్ని ఇలాంటి పోలిక‌లు మ‌రింత పెంచేస్తాయ‌న్న విష‌యాన్ని క‌ల్యాణ్ రామ్ గుర్తుంచుకోవాలి. ఇదేం పౌరాణిక చిత్రం కాదు. మామూలు కమ‌ర్షియ‌ల్ క‌థ‌. మూడు పాత్ర‌లూ ఆ క‌మ‌ర్షియ‌ల్ కోణానికి త‌గ్గ‌ట్టుగానే ఉంటాయి. మూడు పాత్ర‌ల్లో జైకే అగ్ర‌తాంబూలం అన్న సంగ‌తి ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైపోతుంది. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసిన‌ప్పుడు దాన్ని క్లాసిక్ అన‌ద‌గ్గ సినిమాతో పోల్చ‌డం సాహ‌స‌మే. దాన వీర శూర క‌ర్ణ‌ని ఊహించుకొంటూ థియేట‌ర్ల‌లోకి జ‌నం థియేట‌ర్ల‌లోకి అడుగుపెడ‌తార‌ని చెప్ప‌లేం గానీ, సినిమా ఏమాత్రం అటూ ఇటూ అయినా… ఈ పోలిక‌ల‌పై సెట‌ర్లు మొద‌లైపోతాయి. సినిమా విడుద‌లై, సూపర్ డూప‌ర్ హిట్ అయిన‌ప్పుడు ఎన్ని మాట‌లు చెప్పినా చెల్లుబాటు అవుతాయి. విడుద‌లకు ముందు కాస్త నిదానం అవ‌స‌రం. కాదంటారా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com