MAD ఫ్రాంచైజీతో హిట్లు కొట్టిన దర్శకుడు కల్యాణ్ శంకర్. ఈ రెండు సినిమాలూ సితార ఎంటర్టైన్మెంట్స్ కి మంచి లాభాలు తీసుకొచ్చాయి. ఆ తరవాత రవితేజతో కల్యాణ్ శంకర్ ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులూ మొదలయ్యాయి. అయితే.. ఎందుకో ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఈలోగా కల్యాణ్ శంకర్ ఓ హారర్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇది కూడా సితార సంస్థలోనే.
బోయ్స్ హాస్టల్ లో దెయ్యం దూరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. హారర్, కామెడీ రెండింటినీ బలంగా మిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపిస్తారని తెలుస్తోంది. కొన్ని సర్ప్రైజ్ ఎంట్రీలూ ఉండబోతున్నాయట. ఇది పూర్తయ్యాకే రవితేజతో సినిమా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
రవితేజతో చేయాల్సిన సోషియో ఫాంటసీ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీ బడ్జెట్ సినిమాలు వర్కవుట్ కావని, అందుకే ఆ సినిమా పక్కన పెట్టి, ఈ హారర్ సినిమా మొదలెడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ హారర్ సినిమా వర్కవుట్ అయి, సితార సంస్థకు మంచి లాభాలొస్తే.. అప్పుడేమైనా రవితేజ సినిమాపై రిస్క్ తీసుకొనే అవకాశం ఉందేమో?