తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ థగ్ లైఫ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలోకమల్ హాసన్ చరిత్రను కొత్తగా చెప్పుకొచ్చారు. తమిళ వాళ్లకు ఎంత భాషాభిమానం ఉంటుందో.. కన్నడ వాళ్లకూ అలాగే ఉంటుంది. రెండు భాషల వాళ్లూ తమ ఉమ్మడి శత్రువుగా హిందీని ప్రకటించుకున్నాయి. అలాగే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి కానీ.. భాషా వివాదాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడు కమల్ హాసన్.. కన్నడకు మూలం తమిళమేనని చెప్పడం ద్వారా.. ఆ పని పూర్తి చేశారు.
కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు స్టేజ్ పై శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయనకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మెల్లగా ఇది రాజకీయ వివాదం అయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. కన్నడ భాషకు రెండున్నర వేల ఏళ్ల చరిత్ర ఉందని కమల్‌కు తెలియదేమోనని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కూడా కమల్ మాటలను ఖండించారు. తమిళనాడు బీజేపీ నేతలు కూడా ఇలాంటి సున్నితమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. చరిత్రను తవ్వుకుండా చాలా వివాదాలు వస్తాయన్నారు.
కన్నడ రక్షణ వేదిక వంటి సంస్థలు థగ్ లైఫ్ ను.. కర్ణాటకలో ఆడనివ్వబోమంటూ ప్రకటనలు చేస్తున్నారు. దక్షిణాది భాషలు .. లిపిలో చాలా తేడా ఉన్నా మాట్లాడేటప్పుడు కాస్త యాస కలిసిపోతుంది. తెలుగుతో కన్నడకు బాగా పోలిక ఉంటుంది కానీ.. తమిళంతో పెద్దగా ఉండదు. అయినా కమల్ ఏ ఆధారంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ.. నిజమేనని కొంత మంది.. కాదని కన్నడిగులు సోషల్ మీడియాలో వాదనలు ప్రారంభించారు.