అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కు కోపం వచ్చింది. అంటే ట్విట్టర్ ఓపెన్ చేసి.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా వ్యవహరించవద్దని ఆయన ట్రంప్‌కు బహిరంగ లేఖ ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్‌కు అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించడంపై కమల్ ఈ విధంగా స్పందించారు.
మేము భారత ప్రజలం.. ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశానికి చెందినవారం. సుదూర విదేశీ తీరాల నుండి వచ్చే ఆదేశాలను పాటించాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పనేదో మీరు చూసుకోండి అంటూ కమల్ హాసన్ ఎక్స్ దికగా ఘాటుగా స్పందించారు. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే శాశ్వత ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు.
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం, ఆ విషయంలో అమెరికా పెత్తనం చెలాయించడాన్ని కమల్ తీవ్రంగా ఆక్షేపించారు. భారత్ ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే హక్కు కేవలం భారత్‌కు మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చివరగా అమెరికా ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ, ఒక గర్వించదగ్గ భారతీయ పౌరుడు గా కమల్ తన లేఖను ముగించారు.
అమెరికా ప్రకటనపై అందరికీ కోపం వచ్చింది కానీ.. అసలు అలాంటి అవకాశం కల్పించింది ఎవరు అన్నదానిపై .. కమల్ హాసన్.. గట్టిగా విశ్లేషించలేదు.