కమల్ హాసన్. ఓ ప్రయోగ శాల. ఎన్ని హిట్లు కొట్టాడు.. అన్నది పక్కన పెట్టండి. తన కమిట్‌మెంట్, కొత్తగా కనిపించాలన్న తన కసి… ఇవి రెండూ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అందుక తన నుంచి ఓ సినిమా వస్తోందంటే.. ఇప్పటికీ ఓ రకమైన ఆసక్తి. `ఈసారేం చూపించబోతున్నాడో, ఈసారి తాను ఎలా కనిపించబోతున్నాడో` అంటూ కళ్లు వెదికేస్తుంటాయి. `ఖైదీ`లాంటి మాసీ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్… కమల్ హాసన్ కాంబోలో ఓ సినిమా అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ విడుదలైంది. సినిమాకి `విక్రమ్` అనే పేరు పెట్టారు. విక్రమ్ కథేంటి? సినిమాలో ఉన్న సరుకేంటి అని చూపించడానికి టీజర్ వదిలారు. టీజరే… సినిమా చూసినంత కిక్ ఇచ్చింది. ఓ ఇంట్లో… `విక్రమ్` ఎదురు చూస్తుంటాడు. పెద్ద డైనింగ్ టేబుల్. కుక్కర్ విజిల్ వస్తుంటుంది. గరిట ఉండాల్సిన విక్రమ్ చేతిలో.. ఆయుధాలు కనిపిస్తాయి. ఇంతలో అతిథులు వస్తారు. వాళ్లందరికీ పచ్చని అరిటాకులో విందు వడ్డిస్తాడు. ఆఖర్లో.. చేతిలోని ఆయుధం తీస్తాడు. కథలో పాయింట్ అంతా ఈ చిన్న టీజర్ తో చూపించేశాడు లోకేష్. దానికి అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా కదలికలు, ఫ్రేమింగ్, కలరింగ్… వీటికి మించి – కమల్ చివర్లో ఇచ్చిన ఓ చిన్న ఎక్స్‌ప్రెషన్ – ఇవన్నీ కలిపి `విక్రమ్`ని ఆకాశంలో కూర్చోబెట్టాయి. మొత్తంగా మంచి థ్రిల్లర్‌ని త్వరలో చూడబోతున్నామన్న భరోసా కలిగించింది. ఓసారి మీరూ లుక్కేయండి.