Kannappa Movie Review
తెలుగు360 రేటింగ్:2.5/5
రూ.200 కోట్లతో కన్నప్ప సినిమా తీస్తున్నా అన్నప్పుడు విష్ణు మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు, బడా బడా స్టార్లు తన సినిమాలో కనిపిస్తారని హింట్ ఇచ్చినప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. కానీ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్… ఇలా బడా స్టార్లని తన టీమ్ లోకి తీసుకురాగలిగాడు. ‘కన్నప్ప’ కు క్రమంగా ఓ మైలేజ్ సృష్టించగలిగాడు. ఈ సినిమాపై జనం ఫోకస్ చేసేలా చేయగలిగాడు. ముందు నవ్వుకొన్న నోళ్లే.. ఆ తరవాత ‘విష్ణు ఏదో చేస్తున్నాడు.. చూద్దాంలే’ అనుకొనేలా చేశాడు. ఇదంతా విష్ణు క్రెడిట్టే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు సినిమా వచ్చింది. ‘ఈ శుక్రవారం తప్పకుండా నాదే’ అని విడుదలకు ముందు రోజు నమ్మకంగా చెప్పిన విష్ణు.. తన మాట నిలబెట్టుకొన్నాడా? తన కష్టం తగిన ఫలితాన్ని ఇచ్చిందా? ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి హేమా హేమీలు విష్ణుని కాపుకాయగలిగారా?
ధూర్జటి రాసిన ‘కాళహస్తీశ్వర మహత్మ్యం’ చుట్టూ కొన్ని సినిమాలొచ్చాయి. అదే పేరుతో ఓ సినిమా తీశారు. బాపు ఆ గాథని ‘భక్తకన్నప్ప’గా మలిచారు. ఇప్పుడు ‘కన్నప్ప’ స్టోరీ కూడా అదే. దేవుడంటే నమ్మని తిన్నడు అనే ఓ వేటగాడు పరమభక్తుడిగా ఎలా మారాడు? భక్త కన్నప్పగా ఎలా పేరు తెచ్చుకొన్నాడు అనేదే ‘కన్నప్ప’ గాథ. ఈ ఇతిహాస గాథ చర్విత చరణమే కాబట్టి దాని జోలికి వెళ్లడం లేదు.
ఇప్పుడు అందరికీ తెలిసిన కథనే విష్ణు ఎలా చూశాడు? కాగితంపై ఎలా కొత్తగా రాశాడు? అనే విషయాల్లోకి వెళ్దాం. తిన్నడు ఆటవికుడు, వేటగాడనే అందరికీ తెలుసు. కానీ తనో… యుద్ధ వీరుడు అన్నట్టుగా ఈ సినిమాలో చూపించాడు విష్ణు. అందుకోసం వార్ ఎపిసోడ్లు రాసుకొన్నాడు. బాపు ‘భక్త కన్నప్ప’లో ఒక గూడానికి సంబంధించిన కథే కనిపిస్తుంది. ఇక్కడ ఐదు గూడాలు.. వాళ్ల ఆధిపత్య పోరు, ఈ గూడాలపై దాడి చేసిన ఓ యుద్ధ పిపాసి.. అతని రాక్షసత్వం ఇవన్నీ కథలో క్రోడీకరించారు. దాని వల్ల ‘కన్నప్ప’ గాథకు అదనంగా వచ్చిన ఉపయోగం ఏమీ లేకుండా పోయింది. లెంగ్త్ పెరిగింది. దాంతో పాటు ఖర్చు కూడా. తొలి సగంలో తిన్నడు అతని వీరత్వం, దేవుడిపై నమ్మకం లేకపోవడానికి గల కారణాలు, తన ప్రేమగాథ, పోరాటాలూ.. ఇవే చూపించారు. న్యూజీలాండ్ లోని అందమైన లొకేషన్లలో ఆయా సన్నివేశాల్ని మలచడంతో కొన్ని సన్నివేశాలు కంటికి అందంగా కనిపిస్తాయి. మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి నటీనటులు ఉండడం వల్ల తెరకు నిండుదనం వచ్చింది. విశ్రాంతి ఘట్టం ముందు మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తారు. ఆయన పాత్ర గురించి చిత్రబృందం అంతా గొప్పగా చెప్పింది. కాకపోతే అంత ఇంపాక్ట్ ఇచ్చినట్టు కనిపించలేదు. పైగా నిడివి పరంగానూ చిన్నదే.
కథా రచయితగా విష్ణు తన పేరు వేసుకోవడం టైటిల్ కార్డులో కనిపించింది. మూల కథ విషయంలో ‘కాళహస్తీశ్వర మహత్మ్యం’, ‘భక్త కన్నప్ప’ చిత్రాలతో పోల్చి చూస్తే పెద్ద తేడా ఏం కనిపించదు. కేవలం తొలి సగంలో రాసుకొన్న `అదనపు` సన్నివేశాలు మినహాయిస్తే విష్ణు కథకుడిగా ఏం చేయలేదు. కాకపోతే ఆ తొలి సన్నివేశాలే బోర్ కొట్టిస్తాయి. ‘కన్నప్ప’లో మోహన్ లాల్, ప్రభాస్ అతిథి పాత్రలు చేశారు. ఈ రెండు పాత్రలూ ‘కన్నప్ప’లో ఉంటాయి. ఆ పాత్రలు చేసింది ఒకే నటుడు. ఇక్కడ మాత్రం ఆ పాత్రని పంచాడు విష్ణు. అలా చేయడం వల్ల.. ప్రభాస్ లాంటి స్టార్ ని కథలోకి తీసుకురాగలిగాడు.
ప్రభాస్ పై విష్ణు చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని థియేటర్లకు రప్పిస్తుందని ఆశ పడ్డాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. సెకండాఫ్ ఎప్పుడైతే మొదలైందో, అప్పటి నుంచే ప్రభాస్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూడడం మొదలెడతారు. ‘రుద్రా’ అని శివుడు పిలుపుతో ఆ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి ఓ 10 నిమిషాలు థియేటర్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ప్రభాస్ కనిపించిన ప్రతీ మూమెంట్ వాళ్లు ఎంజాయ్ చేస్తారు. ప్రతీ డైలాగ్ వాళ్లకు నచ్చుతుంది. రుద్ర పాత్రపై విష్ణు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఆ పాత్ర లుక్ బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ డీసెంట్ గా ఉంది. ఆ పాత్ర పలికే ప్రతీ డైలాగ్… అర్థవంతంగా ఉంది. విష్ఱు చెప్పినట్టు ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ మరీ 30 – 40 నిమిషాలు ఉండదు. కానీ ఉన్నంత సేపూ… పైసా వసూల్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కానీ తెలిసిన విషయమే అయినా భావోద్వేగ భరితంగా మలిచారు. సినిమా అంతా ఎలా ఉన్నా ప్రభాస్ ఎంట్రీ తరవాత కథాగమనంలో మార్పు కనిపిస్తుంది. అది క్లైమాక్స్ వరకూ కంటిన్యూ అవుతుంది. చివర్లో వచ్చే శివుడి పాట, మేఘాల విజువల్స్ లో శివ పార్వతులు కనిపించడం, కన్నప్ప శివుడిలో ఐక్యం కావడం ఇవన్నీ భక్తులకు నచ్చే అంశాలు. ఏ ఉద్దేశంతో కన్నప్ప చూడ్డానికి థియేటర్లో అడుగు పెడతారో.. ఆ అనుభూతి కలిగించడంలో కన్నప్ప టీమ్ సక్సెస్ అయ్యింది.
విష్ణు తన కెరీర్లో తీసుకొన్న అతి పెద్ద రిస్క్ ఇది. నటుడిగానే కాదు, నిర్మాతగానూ ఓ సాహసం చేశాడు. చివరి 30 నిమిషాల్లో విష్ణు నటన తప్పకుండా నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ లో కంటే ఎమోషన్ సీన్స్‌లో విష్ణు నటన మరింత రక్తి కట్టింది. నిర్మాతగానూ ఈ సినిమాకు కావల్సింది ఇచ్చేశాడు. ప్రభాస్ ఈ సినిమాకు ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. తాను ఎంత సేపు కనిపించాడన్నది పక్కన పెడితే, అతని కోసమే సినిమా థియేటర్ల వరకూ వెళ్లేవాళ్లు 90 శాతం ఉంటారు. అదీ ఈ సినిమాపై ప్రభాస్ ఇంపాక్ట్. మోహన్ లాల్ ది కాసేపు పాత్రే. మరీ గుర్తు పెట్టుకొనేలా ఏం లేదు. శివుడి పాత్రకు అక్షయ్ కుమార్ పరిపోయాడు. తెలుగులో తాను చెప్పిన డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది.. బహుశా… ఏఐ సహకారం తీసుకొని ఉంటారు. మధుబాల పాత్ర తేలిపోయింది. బ్రహ్మానందం ఎపిసోడ్ లేపేసినా పెద్ద నష్టమేం లేదు. మోహన్ బాబు పాత్ర ప్రాధాన్యమైనదే. ఆయన తన సీనియారిటీ చూపించారు.
న్యూజీలాండ్ లో ఈ సినిమా మొత్తం తీసేశాడు విష్ణు. అది కొంత ప్లస్. మరికొంత మైనస్. సహజసిద్ధమైన లొకేషన్లు సన్నివేశాలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. అయితే కొన్ని చోట్ల లొకేషన్లు మరీ గ్లాసీగా అనిపిస్తాయి. ఇలాంటి మైథలాజికల్ టచ్ ఉన్న కథలకు ఆయా లొకేషన్లు సెట్ కాలేదేమో అన్న ఫీలింగ్ తీసుకొచ్చాయి. శివుడి పాట బాగుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం కూడా వినసొంపుగా వుంది. రైటింగ్ పరంగా ఇంకాస్త ఎఫెక్ట్ చూపించాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్ వరకూ. మూడు గంటల సినిమా ఇది. కనీసం 30 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. అలా చేస్తే కథనంలో వేగం పెరిగేది. కొన్ని చోట్ల ఆర్.ఆర్.. సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. ఓ మైథలాజికల్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, ఈ తరానికి నచ్చేలా చెప్పడానికి టీమ్ కష్టపడింది. అయితే అందులో కొంత వరకే విజయాన్ని సాధించింది.
తెలుగు360 రేటింగ్:2.5/5