దేశమంతా ‘కాంతార’ ఫీవరే కనిపిస్తోంది. కన్నడలో ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా మెరుగైన వసూళ్లు అందుకొంటోంది. కలక్షన్లలో ‘కాంతర’ పార్ట్ 1ని బీట్ చేయడం గ్యారెంటీ. రూ.300 నుంచి రూ.400 కోట్ల మైలు రాయి వైపు ‘కాంతార చాప్టర్ 1’ పరుగులు పెడుతోంది. అయితే… హిందీ బెల్ట్ లో ‘కాంతార చాప్టర్ 1’ దమ్మెంత? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కడ ఈ సినిమా అటూ ఇటుగా రూ.100 కోట్లకు చేరువ అవుతోంది. నిజానికి హిందీ బెల్ట్ లో ఈ సినిమా మరింత ఎక్కువ తెస్తుందని నిర్మాతలు భావించారు. దైవత్వానికి సంబంధించిన అంశాలు నార్త్ వాళ్లకు బాగా కనెక్ట్ అవుతాయని, అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని విశ్లేషకులు లెక్కలు వేశారు. హిందీ నాట కాంతార చాప్టర్ 1 యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకొంది. అయితే తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు, నాలుగో రోజు మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆదివారం దాదాపుగా 60 శాతం ఆక్యుపెన్సీ తీసుకొంది.
సోమవారం కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. కేవలం హిందీ బెల్ట్ లోనే ‘కాంతార’ రూ.300 కోట్లు కొడుతుందన్నది భావించారు. కానీ ఆ జోరు.. రూ.150 కోట్ల దగ్గర ఆగే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకొన్నా ఇది మంచి మొత్తమే. ఓ కన్నడ సినిమాకు హిందీ బెల్ట్ లో రూ.150 కోట్లు రావడం మామూలు విషయం కాదు. పైగా ‘కాంతార’ రిలీజ్ రోజున హిందీలో `సంస్కారికా తులసీ కుమారి` అనే సినిమా రిలీజ్ అయ్యింది. హిందీ ప్రేక్షకులు ‘కాంతార’ని ఓ కన్నడ సినిమాగానే చూస్తున్నారు. తమ సినిమాగా భావించడం లేదు. అందుకే వసూళ్లు అనుకొన్న స్థాయిలో లేవు. హిందీ ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకోగలిగితే.. అన్ని చోట్లా కలిపి ‘కాంతార చాప్టర్ 1’ దాదాపు రూ.800 కోట్లకు చేరువ అయ్యేది.