జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారమూరి నాగేశ్వరరావు కుటుంబం, ఇప్పుడు దర్యాప్తు అధికారులకే లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. మరో కేసులో ఇరుక్కుంది. ఏకంగా సిట్ కే లంచాల ఎర వేసిన కారుమూరి కుటుంబ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
సిట్‌ను మ్యానేజ్ చేసేందుకు పాతిక లక్షలు
ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం అధికారులకు లంచం ఇచ్చి, తమ పేర్లను చార్జిషీటు నుంచి తొలగించుకోవాలని వారు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఒక మధ్యవర్తికి రూ. 25 లక్షల నగదు ఇచ్చారు. మద్యం సిండికేట్లకు సహకరించడం , రవాణా ముసుగులో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడటంపై ఇప్పటికే వీరిపై గట్టి నిఘా ఉంది. ఈ కేసుల నుంచి బయటపడేందుకు చట్టపరమైన పోరాటం చేయడం మానేసి, వ్యవస్థలనే మేనేజ్ చేయాలని చూడటంతో మరో కేసులో దొరికిపోయారు.
అవినీతికి లంచాల ముసుగు
మద్యం రవాణా కాంట్రాక్టుల ద్వారా కారమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ,కోడలు కీర్తి భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి వారు అధికారులకు భారీ మొత్తంలో లంచం ఆశ చూపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులనే కొనేయాలని చూసిన ఈ కుట్ర వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇలా చేసిన వాళ్లను ఎలా వదిలి పెడతారు?
గత ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్లకు సహకరించి, రవాణా ముసుగులో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఈ కుటుంబంపై ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ లంచం వ్యవహారం వారిని మరింత చిక్కుల్లోకి నెట్టింది. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు మరియు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు చేసిన ఈ ప్రయత్నంపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


