ప్రభుత్వ ఉద్యోగులకూ సొంత ఇల్లు అనేది కలే. వారు మార్కెట్ రేటుకు పోటీ ఇళ్లు కొనడం అనేది కష్టంగా మారుతోంది. అందుకే ప్రభుత్వాలు పథకాలు తీసుకు వస్తున్నాయి. సొంత ఇల్లు కలలు కనే ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తూ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) ‘కర్మయోగి ఆవాస్ యోజన 2025’ను ప్రారంభించింది. ఈ పథకం ప్రత్యేకంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ , ప్రభుత్వ బ్యాంకులు ,స్వయంప్రతిపత్తి సంస్థల సిబ్బంది కూడా ఈ పథకానికి అర్హులు. ఢిల్లీలోని నరేలా (Narela) సబ్-సిటీలో సిద్ధంగా ఉన్న 1,168 ఫ్లాట్లను ఈ పథకం కింద విక్రయించనున్నారు. 25 శాతం సాధారణ ధరలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ఇళ్లు అందింస్తారు. అన్ని కేటగిరీలు 1BHK, 2BHK, 3BHK ఫ్లాట్లపై ఈ డిస్కౌంట్ను డిడిఏ వర్తింపజేస్తోంది. తగ్గింపు తర్వాత 1BHK ధర సుమారు ₹34 లక్షలు, 2BHK ధర ₹80 లక్షల నుంచి ₹88 లక్షల వరకు, 3BHK లగ్జరీ ఫ్లాట్ల ధర ₹1.15 కోట్ల నుంచి ₹1.27 కోట్ల మధ్య ఉండనుంది. ఇది మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ కావడంతో ఉద్యోగుల నుంచి భారీ స్పందన వస్తోంది.
దరఖాస్తుదారులకు ఢిల్లీలో గానీ, దేశంలోని మరే ఇతర ప్రాంతంలో గానీ సొంత ఇల్లు లేదా స్థలం ఉన్నప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. అంతేకాకుండా, ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 19, 2025 నుండి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి గల ఉద్యోగులు డిడిఏ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చేపడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
