కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. హైకమాండ్ నాయకత్వ మార్పుపై సంకేతాలు ఇస్తూండటంతో ఎవరి దుకాణాలు వారు పెట్టుకుని కథ నడిపిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కొనసాగించేలా చేసేందుకు సిద్ధరామయ్య చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయనకు సానుకూల సంకేతాలు రావడం లేదు. మీ సేవలు ఇక చాలు దయచేయండన్న సిగ్నల్స్ హైకమాండ్ పంపుతోంది. దీంతో సిద్ధరామయ్య ఏం చేయబోతున్నారన్న ఆసక్తి కర్ణాటకలో ప్రారంభమయింది.
సిద్ధరామయ్యను కలవడానికి ఆసక్తి చూపని పెద్దలు
కాంగ్రెస్ పెద్దలు సిద్ధరామయ్యను కలవడానికి ఆసక్తి చూపించడం లేదు. వేరే పని ఉందంటూ ఢిల్లీకి వెళ్లిన ఆయన పనిలో పనిగా హైకమాండ్ ను.. ముఖ్యంగా రాహుల్ ను కలిసేందుకు ప్రయత్నించారు.కానీ రాహుల్ వైపు నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇది సిద్ధరామయ్యపై కాంగ్రెస్ హైకమాండ్ కు తగ్గిపోయిన విశ్వాసానికి సంకేతమని అంటున్నారు . హైకమాండ్ ముఖం చాటేయడంతో ఇక సిద్ధరామయ్యకు ఎగ్జిట్ గేటు చూపించినట్లేనని ..త్వరలో సీఎం మార్పు ఖాయమని కర్ణాటక అంతా గుసగుసలాడుకుంటున్నారు.
హామీ ప్రకారం తనకే చాన్స్ వస్తుందనుకుంటున్న శివకుమార్
హామీ ప్రకారం హైకమాండ్ తనకే చాన్స్ ఇస్తుందని శివకుమార్ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఐదేళ్ల పాటు కష్టపడి..బీజేపీ జైల్లో పెట్టినా సరే. .పార్టీ మారకుండా కాంగ్రెస్ తోనే కొనసాగారు. కానీ ఆయనకు పగ్గాలివ్వడానికి రాహుల్ ఆసక్తి చూపలేదు. డిప్యూటీ సీఎంగా నియమించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల బాద్యతలు ఆయనకే ఇచ్చారు. చాలా వరకూ తనకు ఇచ్చిన అసైన్మెంట్స్ ను పూర్తి చేశారు. ఇప్పుడు తన ప్రతిభను గుర్తించాలని.. పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా దిగజారుతోందని ప్రచారం జరుగుతున్న సమయంలో శివకుమార్ లాంటి మాస్ లీడర్ కు చాన్స్ ఇస్తే మంచిదేనని కాంగ్రెస్ పెద్దలనుకుంటున్నారు.
ఈ నెలలోనే సీఎం మార్పు – సరిగ్గా డీల్ చేయకపోతే కష్టమే
సిద్ధరామయ్యను తప్పించాలని నిర్ణయించుకుంటే.. తదుపరి నాయకుడ్ని ఎంపిక చేయడానికి కాంగ్రెస్ చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. డీకే శివకుమార్ కే ఇవ్వాలన్నా సరే అనేక మందిని బుజ్జగించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో నియోజకవర్గంలో గెలవని వాళ్లు కూడా సీఎం అభ్యర్థులే. వారికి ఆ బలం ఇచ్చేది హైకమాండే. అందుకే ఈ పరిస్థితిని హైకమాండ్ సరిగ్గా డీల్ చేసి.. సిద్ధరామయ్యకు సరైన వారుసుడ్ని పీఠంపై కూర్చోబెట్టకపోతే.. ఆ పార్టీ ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.


