కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. హైకమాండ్ ఆదేశాలతో కుల గణన చేయాలని నిర్ణయించారు. ఈమేరకు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ప్రకటించారు.
కుల గణన సామాజిక సంజీవని అని పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేపట్టిన జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ఈమేరకు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో కర్నాటకలో కుల గణన చేశారు. వెనకబడిన సామాజిక వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 32శాతం నుంచి 51శాతానికి పెంచాలని కుల గణన నివేదిక సిఫార్స్ చేసింది. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు 4శాతం బదులుగా 8శాతం రిజర్వేషన్లు పెంచాలను నివేదికలో పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో బీసీలకు 51శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు.
అయితే, ఈ కుల గణన నివేదికను అక్కడి ఒక్కలిగ , లింగాయత్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని ఆరోపించాయి. మరోసారి కొత్తగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. లింగాయత్ ల జనాభాను 66లక్షలుగా మాత్రమే చూపించారని ఆరోపించారు. ఉప కులాలు, తెగలను చేర్చితే లింగాయత్ లు మూడు కోట్ల మంది ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే కర్ణాటక సర్కార్ చేపట్టిన కుల గణనపై అభ్యంతరాలు రావడం, కేంద్రం కూడా కుల గణనకు అంగీకారం తెలపడంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కర్నాటకలో మరోసారి కుల గణన చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.