రోహిత్ వేముల బిల్లు తీసుకు రావాలని రాహుల్ గాంధీ… కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. తర్వాత అదేమయిందో మర్చిపోయారు. కానీ సిద్ధరామయ్య మర్చిపోలేదు. బిల్లు రెడీ చేయించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. రోహిత్ వేముల విద్య, గౌరవ హక్కు బిల్లు, 2025 పేరుతో డ్రాఫ్టు రెడీ అయింది. ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులపై వివక్షను నిరోధించే లక్ష్యంతో ఈ బిల్లు రూపొందించిట్లుగా సిద్ధరామయ్య చెబుతున్నారు.
రోహిత్ వేముల బిల్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు బహిష్కరణ, అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతుంది. SC/ST విద్యార్థులను ప్రవేశం నిరాకరించడం, వారి నుంచి డబ్బు డిమాండ్ చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని అరికడుతుందని చెబుతున్నారు. విచారణను ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. రోహిత్ వేముల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే మొదటి నేరం రుజువైతే ఏడాది పాటు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. బాధితుడికి లక్ష వరకు పరిహారం అందించేలా నిందితులను ఆదేశించే అవకాశం ఉంది.
రోహిత్ వేముల 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నారు. అతను దళితుడు అయినందువల్లే వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారన్న రాజకీయల దుమారం రేగింది. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. రాహుల్ గాంధీ ఈ విషయంలో దేశవ్యాప్త రాజకీయం చేశారు. సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చి వెళ్లారు. ఆయన సూచనలతోనే ఈ బిల్లును కర్ణాటక తీసుకు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకు వచ్చే అవకాశం ఉంది.