కర్ణాటకలో ఖరీదైన ప్రజాస్వామ్యాన్ని కొనే బలవంతుడెవరు..? నేడే బలపరీక్ష..!

కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఓ సరికొత్త పతనాన్ని చూస్తోంది. అత్యంత ఖరీదుగా ప్రజల తీర్పును కూడా… బేరసారాలకు అడ్డాగా మార్చేసిన వైనం దేశం ముందు సాక్షాత్కరిస్తోంది. ఇదేం పతనమని ఓ పార్టీని ప్రశ్నిస్తే.. అప్పుడు మీరు చేయలేదా..? అని ఎదురు దాడి చేస్తున్నారు. దొందూదొందే అని నిరూపిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్ష జరగనుంది. ఇప్పటికే వందల రెట్లు ఆస్తుల సంపాదన ఆఫర్లు, మంత్రి పదవుల ప్రలోభాలు ఆడియో టేపుల సాక్షిగా బయటకు వచ్చాయి. ప్రొటెం స్పీకర్‌ ఎంపికలో కూడా.. సరికొత్త పతనాన్ని లిఖించారు.

కర్ణాటక అసెంబ్లీలో వాస్తవ లెక్క ప్రకారం యడ్యూరప్ప ప్రభుత్వానికి మెజార్టీ లేదు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. రెండు స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్, జేడీఎస్, మరో ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిసి 118 మంది ఉన్నారు. కానీ జేడీఎస్ నేత కుమారస్వామి రెండు సీట్లలో గెలిచారు కాబట్టి.. ఒక్కదాని కిందే లెక్క వస్తుంది. ఈ సమీకరణం తర్వాత చూస్తే.. మెజార్టీకి ఇంకా బీజేపీకి ఏడుగురు కావాలి.

ఈ ఏడుగురు కాదు.. ఇంకో తొమ్మిది మంది తమకు మద్దతివ్వడానికి రెడీగా ఉన్నారని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఘనంగా ప్రకటించుకున్నారు. ఆయన ఇలా ప్రకటిస్తున్న సమయంలోనే.. గాలి జనార్దన్ రెడ్డి… ఓ ఎమ్మెల్యేలకు వంద రెట్లు ఎక్కువ ఆస్తి సంపాదన, మంత్రి పదవి లాంటి లైఫ్ టైమ్ ఆఫర్లు ఇస్తూ.. ఆడియో టేపుల సాక్షిగా దొరికిపోయారు. ఈ ధైర్యం ఏమో.. ఏడుగురు కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నారని యడ్యూరప్ప కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

ధనం, పదవుల ఆశే కాదు… కులం సెంటిమెంట్‌తోనూ కర్ణాటక రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. యడ్యూరప్ప లింగాయత్ వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సులువుగా మద్దతిచ్చే అవకాశం ఉందన్న అంచనాతో వారితో చర్చలు జరిపారు. జేడీఎస్ బీజేపీలోని వక్కలిగవర్గం ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. జేడీఎస్ కంచుకోట అయిన హసన్ జిల్లా హసన్ స్థానం నుంచి ఈ సారి బీజేపీ అభ్యర్థిగా ప్రీతమ్ గౌడ అనే యువకుడు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఈ ప్రీతం బీజేపీ క్యాంప్ లో లేరని ప్రచారం జరుగుతోంది.

ఎవరు గెలిచినా ఓడిపోయేది ప్రజాస్వామ్యమే. ఏ పార్టీ తరపున గెలిచిన వాళ్లు ఆ పార్టీ తరపున ఉంటే… కనీసం మన ప్రజాస్వామ్యానికి ఊపిరి అయినా నిలబడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com