బాహుబలి ప్రభావం ఇండియన్ సినిమాపై ఎంత పడిందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. కార్తి నటిస్తున్న తమిళ చిత్రం.. కాశ్మోరా. గోకుల్ దర్శకత్వం వహించాడు. ఇదో హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో కార్తి గెటప్ చూస్తే కళ్లు చెదరడం ఖాయం. అతి భయంకరమైన లుక్ అది… ఓ హీరో ఇలాంటి లుక్‌లో కనిపించే సాహసం చేయడం… నిజంగా గ్రేటే. అయితే.. కాశ్మోరాలో కార్తి లుక్.. బాహుబలిలోని కాళకేయ లుక్‌ని పోలి ఉండడం మరో కొత్త చర్చకు తావిస్తోంది. కాశ్మోరాపై బాహుబలి ప్రభావం పడిందా? లేదంటే… కాశ్మోరాలో కార్తి పాత్రలో అంత వైవిధ్యం ఉందా? అనేది తేలాలంటే ఈ సినిమా రావాల్సిందే.
దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. కార్తి నటిస్తున్న తొలి హారర్ చిత్రం ఇదే. అందుకోసం లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఫస్ట్ లుక్ చూస్తే… కార్తి ఈ పాత్ర కోసం పడిన కష్టమేంటన్నది అర్థం అవుతుంది. ఇటీవల కార్తి చేస్తున్న సినిమాలేవీ సరైన ఫలితాల్ని ఇవ్వడం లేదు. కార్తి మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఈ కాశ్మోరా కాసులు కురిపించాల్సిందే. ఈ లుక్ బయటకు వచ్చాక… కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.