తెలుగులో స్ట్రయిట్ గా ఓ సినిమా చేయాలని సూర్య ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. కానీ అది వర్కవుట్ కావడం లేదు. వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నా, అందులో తమిళ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించబోతోంది. అయితే తమ్ముడు కార్తి మాత్రం తెలుగు సినిమాతో టచ్ లోనే ఉంటున్నాడు. అప్పుడెప్పుడో ఊపిరి అనే ఓ సినిమా చేశాడు. అందులో కార్తి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకొన్నాయి. అప్పటి నుంచి తెలుగు లో మరో స్ట్రయిట్ సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రణాళికలన్నీ ఫలించాయి. ఇప్పుడు కార్తి వరుసగా తెలుగులోనే సినిమాలు చేయబోతున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు తెలుగు సినిమాలతో గడపబోతున్నాడు కార్తి.
హిట్ 4లో కార్తి కనిపించడం ఎప్పుడో ఖాయమైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమాలో కార్తి పేరు గట్టిగా వినిపిస్తోంది. లెక్కలన్నీ ఓ కొలిక్కి వస్తే ఈ ప్రాజెక్ట్ లోకి కార్తీ వచ్చేస్తాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కార్తి హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. మాడ్, మాడ్ 2 తీసిన కల్యాణ్ శంకర్ దర్శకుడు. కథ దాదాపుగా లాక్ అయిపోయింది. ఈ సినిమానీ వీలైనంత త్వరగానే పట్టాలెక్కిస్తారు. అంటే బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలతో కార్తీ తెలుగులో బిజీ అయిపోతున్నాడన్నమాట. మధ్యలో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంటుంది. ఈలోగా ఇంకెన్ని కొత్త కథలు ఓకే చేస్తాడో..
