Karthikeya2 movie review telugu
తెలుగు360 రేటింగ్ :3/5
“నీ కంటికి కనిపించలేదంటే.. ఆ వస్తువు లేదని కాదు. నువ్వు చూడలేకపోతున్నావని అర్థం..“
– కార్తికేయలో వినిపించిన డైలాగ్ ఇది. ఈ సృష్టి కూడా అంతే. చాలా విషయాలు మనం నమ్మలేం. నమ్మలేనంత మాత్రాన అవి నిజాలు కాకుండా పోవు. కొన్ని విషయాల్లో సైన్స్ లోనే లాజిక్ ఉండదు. ఇక మన పురాణాల్లో ఎందుకు ఉండాలి? సైన్స్‌కీ, ఇతిహాసాన్ని కలిపి లాజికల్‌గా కథలు చెబితే… జనం బాగానే వింటారు, సినిమాలు చూస్తారు అనే విషయం `కార్తికేయ`తో నిరూపించాడు చందూమెండేటి. సరిగ్గా అదే… ఆలోచనతో, ఇంకాస్త పెద్ద స్పాన్‌లో… `కార్తికేయ 2` తీశాడు. సీక్వెల్స్ అంటే తెలుగు జనాలకు కాస్త భయం. ఎందుకంటే… అవి ఆడిన దాఖలాలు పెద్దగా లేవు. కేవలం టైటిల్ ని వాడుకొని, పబ్లిసిటీ తెచ్చుకోవడానికి వాడే అస్త్రం… సీక్వెల్.ఇలాంటి అనుమానాలు వెంబడిస్తున్న నేపథ్యంలో `కార్తికేయ 2` వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాల్ని తలకిందులు చేసిందా? అనుమానాలే నిజం అని తేల్చిందా?
ప్రతీ విషయంలోనూ లాజిక్ ఆలోచించే మెడికోగా కార్తికేయ (నిఖిల్ సిద్దార్ధ్) కనిపించాడు.. కార్తికేయ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో తను డాక్టర్ గా మారాడు. కాకపోతే.. తన లాజిక్కులు, ప్రశ్నల్ని వెంటాడే క్యూరియాసిటీ.. ఇంకా అలానే ఉన్నాయి. అలాంటి కార్తికేయకు మరో బలమైన ప్రశ్న ఎదురైతే ఏమైందన్నది `కార్తికేయ 2` కథ. కొంతమంది మేథావులు, చరిత్రకారులు, ఆర్కియాలజీలో నిపుణులు కలిసి సీక్రెట్ సొసైటీ అనే ఓ గ్రూపుగా మారతారు. దీనికి పెద్ద.. సంతాను (ఆదిత్య మీనన్). తనకు శ్రీకృష్ణుడిపై అపారమైన నమ్మకం. త్వరలో మానవాళికి పెద్ద ముప్పు వాటిల్లనుందని, దానికి పరిష్కార మార్గం శ్రీకృష్ణుడి దగ్గరే ఉందని విశ్వసిస్తాడు సంతాను. ద్వాపర యుగం నాటి శ్రీకృష్ఱుడి కంకణంలో.. ఈ విపత్తుని అరికట్టడానికి పరిష్కార మార్గం ఉందని తెలియడంతో.. దాని కోసం అన్వేషిస్తుంటాడు. అయితే ఆ కంకణాన్ని వెదికే బాధ్యత విధి.. కార్తికేయపై పెడుతుంది. అనుకోకుండా ఈ వలయంలో చిక్కుకొన్న కార్తికేయ ఆ కంకణం కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఇంతకీ ఆ కంకణం దొరికిందా, లేదా? అసలు ఈ కార్యాన్నికార్తికేయ తన భుజాలపై ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో ముగ్థ (అనుపమ పరమేశ్వరన్) కార్తికేయకు ఎలా సాయం చేసింది? అనేది మిగిలిన కథ.
ద్వాపర యుగం నాటి శ్రీకృష్ఱుడి చరిత్రతో ఈ కథ మొదలవుతుంది. ఆ సన్నివేశాన్ని యానిమేషన్లో చెబుతూ కథలోకి ప్రేక్షకుడిని లాక్కెళ్లాడు దర్శకుడు. త్వరలో ప్రళయం వస్తుందని, దాన్ని ఆపే శక్తి.. శ్రీకృష్ణుడు ఆ కాలంలోనే విడిచి వెళ్లాడని, ఆ వస్తువు కోసం అన్ని విధాలా అర్హతలు ఉన్న ఓ కార్యసాధకుడు వస్తాడని ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాడు. ఆ తరవాత కార్తికేయగా నిఖిల్ ఎంట్రీ ఇస్తాడు. తాను లాజికల్ గా ఎంత స్ట్రాంగో.. తొలి సన్నివేశాల్లోనే చూపించేశాడు దర్శకుడు. మైథాలజీని ఓ ట్రజర్ హంట్ కథతో ముడిపెట్టాడు దర్శకుడు. నిజంగా ఇది తెలివైన మేళవింపు. సాధారణంగా ట్రెజర్ హంట్ లో ఓ విలువైన వస్తువు కోసం అన్వేషణ మొదలవుతుంది. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు వస్తుంటాయి. చివరికి ఆ నిధిని హీరో సాధిస్తాడు. ఈ కూడా అలాంటిదే. కాకపోతే. నిధి స్థానంలో కృష్ణుడికి సంబంధించిన కడియం ఉంది. హీరో తన స్వార్థం కోసం కాకుండా లోక కల్యాణం కోసం ఈ సాహస యాత్ర మొదలెడతాడు. అదే… కార్తికేయలో కనిపించే ప్రత్యేకమైన అంశం.
ఈ కథని ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి? అనే విషయంలో చందూ మెండేటికి కొన్ని లెక్కలున్నాయి. వాటి ప్రకారమే కథని బిగించి చెప్పాడు. తొలి సగం గంటలోనే పూర్తవుతుంది. ఇలాంటి కథలకు ఈ వేగం చాలా అవసరం. హీరోయిన్ తో లవ్ ట్రాకు లేకపోవడం, హీరో ఇంట్రడక్షన్ కోసమో, బిల్డప్పుల కోసమో కొన్ని సీన్లు తీసి, కాలయాపక చేయకపోవడం కలిసొచ్చిన అంశం. దాంతో కథ పరుగులు పెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తొలి సగంలో అన్నీ ప్రశ్నలే. వాటికి సమాధానాలు సెకండాఫ్‌లో దొరుకుతాయి. నెమలి బొమ్మ ద్వారా, బైనాక్యులర్, బైనాక్యులర్ ద్వారా. కంకణం సంపాదించడం.. ఇదీ హీరో వెనుక టాస్క్. ఒక్కొటి సాధించడానికి ఒక్కో ఫీట్ చేయాల్సివస్తుంది. అవన్నీ ఆసక్తికరంగా మలిచాడు.
అయితే ఈ కథకు ప్రాణమైన కంకణం అందుకొనే సీన్ మాత్రం చుట్టేసిన ఫీలింగ్. త్వరగా ముగించిన భావన కలుగుతుంది. అక్కడ హీరోకి మరిన్ని టాస్కులు ఇవ్వకుండా, ఈజీగానే దొరికేసింది అన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. పైగా.. హీరోకి టైమ్ లిమిట్ ఏమీ ఉండదు. ఈ సమయంలోగా… హీరోకి ఈ వస్తువు దొరక్కపోతే, ఈ లోకం ఏమైపోతుందో.? అనే భయం, ఉత్కంఠత ప్రేక్షకుల్లో కలగదు. ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కించిన ప్రతీ కథలోనూ టైమ్ బాండింగ్ ఉంటుంది. చేరాల్సిన గమ్యానికీ, హీరోకీ ఓ పర్సనల్ లింక్ ఉంటుంది. ఉదాహరణకు జగదీక వీరుడు అతిలోక సుందరి తీసుకోండి. అందులో పాప ప్రాణాలు కాపాడడం హీరో టాస్క్. దాంతో ఆ పాత్రతో ప్రేక్షకుడు ట్రావెల్ చేస్తాడు. అలాంటి చిన్న చిన్న లింకులు ఈ కథలో కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
హిందుత్వం, దాని గొప్పదనం, మన పురాణాల విశిష్టత.. వీటిని చెప్పడానికి అనువైన ప్రతీ చోటునీ దర్శకుడు వాడుకొన్నాడు. ఉదాహరణకు.. అనుపమ్ ఖేర్‌తో సీన్. ఆ సన్నివేశం లేకపోయినా ఈ కథకు వచ్చే నష్టం లేదు. కాకపోతే… శ్రీకృష్ణ తత్వం బోధించడానికి ఈ సీన్ ఓ వేదిక అయ్యింది. ద్వారకనీ, కృష్ణుడ్నీ ఎలా అర్థం చేసుకోవాలి? ఏ కోణంలో వాటిని చూడాలి? అనే విషయాన్ని ఈ సీన్ తో దర్శకుడు విడమరచి చెప్పగలిగాడు. “అద్భుతం జరిగింది కాబట్టి నేను నమ్మలేదు.. నేను నమ్మాను కాబట్టి అద్భుతం జరిగింది“ లాంటి డైలాగుల్లో – మతాల్నీ, నమ్మకాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనేది తెలుస్తుంది. “దేవుడంటే పూజించడం కాదు. అర్థం చేసుకోవడం“ అనే డైలాగ్ కూడా ఈ కోవలోకి వచ్చేదే.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని నమ్ముకొన్న ప్రతీసారీ నిఖిల్ హిట్టు కొట్టాడు. తన నమ్మకం మరోసారి నిజమైంది. కార్తికేయ అనే పాత్రకు పూర్తిగా బెండ్ అయిపోయాడు నిఖిల్. ఆ పాత్రకు ఏం కావాలో అది ఇచ్చేశాడు. ఈ పాత్రతో నిఖిల్ – చందూలు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ప్రతీ కథకూ ఓ హీరోయిన్ కావాలి కాబట్టి అనుపమ ని తీసుకోలేదు. ఆ పాత్రకూ ఈ కథలో ప్రాధాన్యం ఉంది. రెగ్యులర్ గా అయితే అనుపమ లాంటి హీరోయిన్ ఉంది కాబట్టి, ఒకట్రెండు పాటలు ఇరికించొచ్చు. కనీసం ఆ దిశగా కూడా దర్శకుడు ఆలోచించకపోవడంతో సినిమాకి మేలు జరిగింది. ఆదిత్య మీనన్ పాత్రకు మంచి ఆరభం అయితే దొరికింది కానీ, సరిగా ముగించలేదు అనిపిస్తుంది.
టెక్నికల్ గా ఈ సినిమాకి పేరు పెట్టలేం. తొలి సన్నివేశాల్లో చూపించిన యానిమేషన్స్ నుంచి చివరి సీన్లో కనిపించిన పాముల వరకూ అన్ని చోట్లా విజువల్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ అత్యంత సహజంగా అనిపించాయి. మంచు కొండలు, ద్వారక.. ఇలా కొత్త లొకేషన్లు చూసే అవకాశం దక్కింది. ఈ కథకు ఓ కొత్త ఫ్లేవర్ తోడైంది. అన్నింటికంటే ముఖ్యంగా కాలభైరవ సంగీతం గురించి చెప్పుకోవాలి. పాటలకు అస్సలు స్కోప్ లేని సినిమా ఇది. కాలభైరవ తన నేపథ్య సంగీతంతో ఆ లోటు తీర్చుకొన్నాడు. కార్తికేయ థీమ్.. వెంటాడుతుంది. చందూ చాలా గ్రిప్పింగ్ గా ఈ కథ రాసుకొన్నాడు. అనవసరమైన సీన్లకు స్క్రిప్టు దశలోనే కత్తెర వేసుకొన్నాడు. కాబట్టి లెంగ్త్ పరంగా ఇబ్బంది పెట్లలేదు. కాకపోతే.. తొలి సన్నివేశాల్లో కథని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
ఇండియన్ మైథాలజీతో, ట్రజర్ హంట్ లాంటి కథని ముడివేస్తే.. ప్రేక్షకుల్ని థియేటర్లను కూర్చోబెట్టవచ్చన్న నమ్మకం కలిగించిన సినిమా ఇది. త్వరలో ఈ జోనర్లో మరిన్ని చిత్రాలు రావడానికి కార్తికేయ 2 దోహదం చేస్తుంది. సీక్వెల్ సినిమాలు హిట్టు కావు…అనే అపప్రదని ఈ సినిమా పోగొట్టింది.
ఫినిషింగ్ టచ్: మ్యాజిక్ పని చేసింది!
తెలుగు360 రేటింగ్ :3/5