కార్తి సినిమా చిక్కుల్లో పడింది. రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాకి సడన్ బ్రేక్ పడింది. సినిమా ఇప్పుడు కోర్టు చుట్టూ కేసులో ఇరుక్కుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తి చేసిన సినిమా ‘వా వాదియార్’. ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్లాల్ సుందర్దాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గతంలో అర్జున్ లాల్ వద్ద స్టూడియో గ్రీన్ సినిమా నిర్మాణ సంస్థ రూ.10.35 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తం వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.21.78 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ ఉత్తర్వులు ఇవ్వాలని, అంతవరకూ ‘వా వాదియార్’ విడుదల ఆపాలనిఅర్జున్లాల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చి, తదుపరి విచారణను ఈ నెల 8కి తేదీకి వాయిదా వేసింది.
డిసెంబరు 12న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలో ఆర్థిక లావాదేవీల కేసు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి తెలుగులో ‘అన్నగారు వస్తారు’ టైటిల్ పెట్టారు. కార్తి తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో ఇప్పుడీ సడన్ బ్రేక్ పడింది.