ఓ వ్యక్తి .. పదే పదే ఒకే రకమైన గొడవలు పడుతూంటే… తప్పు అతనితో గొడవలు పడేవారిది కాదు.. ఇతనిదే అవుతుంది. ఎందుకంటే అతని నైజం అదే అవుతుంది. రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి అంతే. ఎక్కడికి వెళ్లినా ఏదో ఓ రచ్చ చేసి రాజకీయం చేయడమే గొప్ప అనుకుంటారు. చివరికి దేవుడి దగ్గరా అదే చేస్తున్నారు.
వీణవంకలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరుపై భక్తులు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ రచ్చ చేయడమే రాజకీయం అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటోందనే విమర్శలు ఈ ఘటనతో మరింత బలపడ్డాయి. జాతరలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు నిబంధనల మేరకు పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ.. ఆయన తన భారీ కాన్వాయ్‌తో వెళ్లేందుకు ప్రయత్నించి ఉద్రిక్తతకు దారితీశారు.
జాతర వంటి పవిత్రమైన చోట భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పోలీసులు అడ్డుకుంటే, దానిని రాజకీయం చేస్తూ రోడ్డుపై బైఠాయించి హడావుడి చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మతం పేరుతో దూషించడం, ఉన్నత స్థాయి అధికారులను బెదిరించడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారిది. జాతర ప్రాంగణంలో కూడా దళిత మహిళా సర్పంచ్‌తో కొబ్బరికాయ కొట్టించాలనే సాకుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధపడతారని క్లారిటీ వచ్చినట్లయింది.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సంయమనం పాటించాల్సింది పోయి, పోలీసులపై దూకుడు ప్రదర్శించి ఓవరాక్షన్ చేయడం వల్ల సామాన్య భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఒక పక్క అమ్మవారి దర్శనం కోసం వేల సంఖ్యలో ప్రజలు వేచి చూస్తుంటే, వారిని ఇబ్బంది పెడుతూ ఇలాంటి ర్యాలీలు , నిరసనలు చేయడం ఏ రకమైన రాజకీయం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
