తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలు సహా ఎవరూ తనకు మద్దతుగా ముందుకు రాకపోవడంతో జాగృతి అధ్యక్షురాలు కవిత మనస్థాపానికి గురయ్యారు. అది వారి విచక్షణకే వదిలేస్తున్నానని గురువారం వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీఆర్ఎస్ విధానాలను తప్పు పట్టారు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించడం సరి కాదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగపరంగా చెల్లుతుందా లేదాఅన్నదానిపై తాను న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాతనే స్పందించానని చెప్పుకొచ్చారు. చివరికి బీఆర్ఎస్ వాళ్లు తన దారికి రావాల్సిందేనన్నారు. అంటే ఈ విషయంలో కవిత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నారన్నమాట. ఓ వైపు తీన్మార్ మల్లన్న విషయంలో సొంత కుటుంబం కూడా పట్టించుకోకపోవడం.. మరో వైపు కవిత కాంగ్రెస్ కు బీసీ ఆర్డినెన్స్ కు మద్దతు తెలియచేయడం రెండూ రాజకీయాల్లో జరగనున్న కీలక మార్పులకు వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కవిత ఖచ్చితంగా వేరు బాటలో ఉన్నారని ఆమెకు మద్దతు తెలిపితే.. మరింతగా ఇబ్బంది పడతామని బీఆర్ఎస్ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.ల అయితే కవిత మాత్రం తాను బీఆర్ఎస్ అని చెబుతున్నారు కానీ.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కవిత ఇక తమ పార్టీ కాదని.. ఆమెను బయటకు గెంటేయలేరు అలాగని పార్టీలోనే ఉండనివ్వలేరు అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. కవిత విషయంలో బీఆర్ఎస్ నాన్చుతోంది.. కవిత కూడా తనంతట తానుగా బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.