తెలంగాణ ప్రజలకు వజ్రాయుధం లాంటి పార్టీ ఇస్తానని కల్వకుంట్ల కవిత జనం బాటలో ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతానికి కవిత రాజకీయ నేత కాదు.కేవలం ఉద్యమకారణి మాత్రమే. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నారు. అలాగని తాను రాజకీయాల్లోకి రానని చెప్పడం లేదు. కచ్చితంగా వస్తానని చెబుతున్నారు. కానీ ఎప్పుుడన్నది మాత్రం చెప్పడం లేదు. కవిత ఇప్పుడు చేస్తున్నది రాజకీయమే. కానీ రాజకీయ పార్టీగా ప్రకటించకుండా ఎందుకు రాజకీయాలు చేస్తున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. కానీ ఆమె ప్రకటనల ద్వారా ఒక్కొక్కటి డీకోడ్ చేస్తే.. అసలు విషయంపై క్లారిటీకి వస్తుంది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదని కవిత నమ్మకం
భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా ఏం జరుగుతుందో.. ఏం జరిగిందో కవితకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అందులో కొన్ని విషయాలను ఆమె బయట పెట్టారు. బీజేపీతో విలీన చర్చలు జరిగాయని బహిరంగంగానే ప్రకటించారు. ఇవాళ కాకపోతే రేపు అయినా విలీనం అయిపోతుందని కవిత గట్టిగా నమ్ముతున్నారు. ఆ సంకేతాలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కూడా కనిపించాయి. బీఆర్ఎస్ పార్టీకి సహకరించడానికి బీజేపీ ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గింది. ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు. బండి సంజయ్ లాంటి డైనమిక్ లీడర్ కు అధ్యక్ష పదవి ఇవ్వలేదు. బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ పాత్ర కీలకం. ఆయనే అధ్యక్ష పదవిలో ఉండే బీజేపీ ఓ రేంజ్ లో ఉండేది.
బీఆర్ఎస్ విలీనమైతే ఓ ఇంటి పార్టీకి అవకాశం
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయింది. తెలంగాణ బ్రాండ్ పోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పుడు సర్వైవ్ కావాలంటే విలీనం లేదా పొత్తులు తప్పవని అనుకుంటున్నారు. బీజేపీ పొత్తులు పెట్టుకుంటుందా.. విలీనానికే రెడీ అంటుందా అన్నది పార్టీ వర్గాలకూ అంచనాలకు అందడం లేదు. బీజేపీ విలీనం అంటే జరిగి తీరాల్సిందే.అలా జరిగితే.. ఓ ప్రాంతీయ పార్టీకి..అది కూడా తెలంగాణ ఇంటి పార్టీకి అవకాశం ఉంటుంది. కవిత ఇక్కడే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ విలీనమైతే తాను టీఆర్ఎస్ తీసుకు వస్తానని ప్రజలకు పరోక్షంగా చెబుతున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూపులు
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు లేదా విలీనం ప్రక్రియ జరిగితే.. అప్పులు పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడుతుంది. రెండు జాతీయ పార్టీలే అవుతాయి. మరి తెలంగాణ ఇంటి పార్టీ ఉండవద్దా అని కవిత బలంగా దూసుకు వస్తారు. సెంటిమెంట్ రాజకీయాలు ఎలా చేయాలో కవితకు బాగా తెలుసు. కేసీఆర్ మార్క్ రాజకీయ వ్యూహాలతో ఆమె దూసుకెళ్తారు. అందులో సందేహం ఉండదు. ఇప్పటికిప్పుడు పార్టీ పెడితే.. బీ జేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరేసరికి పాతబడిపోతుంది. ఒప్పందం కుదిరిన వేడిలో పార్టీ పెడితే బీజేపీ వైపు వెళ్లలేని బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ కవిత వైపు వస్తారు. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. అందుకే కవిత ఇప్పుడు గ్రౌండ్ ప్రిపరేషన్ జోరుగా చేసుకుంటున్నారు.


