ఏ ప్రభుత్వం ఉన్నా హరీష్ రావు హవా మాత్రం తగ్గడం లేదని కవిత అంటున్నారు. తాజాగా ఆమె సిద్ధిపేట మున్సిపాలిటీకి మంజూరైన నిధులపై ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్లోని మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైనా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనైనా సిద్దిపేట నియోజకవర్గానికే నిధులు , అభివృద్ధి పనుల్లో అగ్రతాంబూలం దక్కుతోందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల కోసం మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వస్తే కేవలం సిద్దిపేటకు మాత్రమే నిధులు మంజూరు కావడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిధులన్నీ అటు తరలించడం వల్ల అక్కడ అభివృద్ధి వేగంగా సాగిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం వెనుక ఉన్న మర్మమేంటని ఆమె ప్రశ్నించారు.
సిద్దిపేటకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వెనుక ఉన్న రాజకీయ పూర్వాపరాలను ఆమె విశ్లేషించారు. ఒకవైపు రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే, సిద్దిపేట వంటి ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్న. ఎందుకంటే హరీష్ రావు..రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని నిరూపించడానికి ఇంత కంటే సాక్ష్యం ఏమి కావాలని ఆమె చెప్పాలనుకుంటున్నారు. అదే సందేశాన్ని తన ప్రెస్మీట్ ద్వారా పంపారన్నమాట.