భారత రాష్ట్ర సమితికి ఏదీ కలసి రావడం లేదు. అన్ని సమస్యలూ ఆ పార్టీనే చుట్టుముుడుతున్నాయి.అందరూ ఆ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా వెళ్లి కొన్ని వివాదాలను నెత్తిన చుట్టుకుంటున్నారు. అలాంటి అవసరం లేని రాజకీయాలను కవిత విషయంలో చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఆమెపై విమర్శలు చేస్తూండటంతో .. ఆమె అవే అవకాశాలుగా తీసుకుని తనదైన రాజకీయం చేస్తున్నారు. కవితకు కౌంటర్ ఇస్తే ఆ ఇష్యూ పెరిగి పెద్దదవుతుంది. లేకపోతే విమర్శలను నిజం అని ఒప్పుకున్నట్లవుతుందని నేతలు మథన పడుతున్నారు.
నిరంజన్ రెడ్డి పుచ్చ పగిలిపోతుదంని కవిత వార్నింగ్
జనంబాట కార్యక్రమంలో భాగంగా వనపర్తి వెళ్లిన కవిత.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందని ఘాటుగా హెచ్చరించారు . ఆమె అలా హెచ్చరించడానికి కారణం అంతకు ముందు నిరంజన్ రెడ్డి.. కవితపై వంకాయతో పోల్చి పరోక్షంగా విమర్శలు చేయడమే. తనపై అలా మాట్లాడేవారికి గట్టి వార్నింగ్ పంపాలని.. పుచ్చ పగిలిపోతుందనే భాషను వాడారు. దాంతో నిరంజన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది.అదే భాషలో కౌంటర్ ఇవ్వలేరు. కేసీఆర్ కుమార్తె పైగా.. మహిళ. అందుకే మీ కుటుంబ సమస్య పార్టీకేం సంబంధం అని బేలగా మాట్లాడారు. కవితకు కావాల్సింది అదే.
బీఆర్ఎస్ నేతల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్న కవిత
కవిత జనంబాట కార్యక్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీని నిందించడం లేదు. కేసీఆర్ బాగా పరిపాలించారని అంటున్నారు. కానీ కొన్ని పనులు మధ్యలో ఉన్నాయని వాటిని పూర్తి చేయాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కొంత మందిని గట్టిగా కార్నర్ చేస్తున్నారు. అలాంటి వారు.. తనను విమర్శించిన వారు మాత్రమే కాదు.., హరీష్ రావు సన్నిహితులు కూడా. అందుకే అందరిపై హరీష్ రావు అనే వర్గం ముద్ర వేసి .. తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణలకు వారు కౌంటర్ ఇచ్చుకోక తప్పడం లేదు.
అంతిమంగా హరీష్ రావే టార్గెట్
కవిత జాగృతి రాజకీయంలో ఫైనల్ టార్గెట్ హరీష్ రావేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక్కడే కాకుండా.. ఆయనతో సన్నిహితంగా ఉండే వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. కవిత రాజకీయం గురించి ఆవగాహన ఉన్నా… బీఆర్ఎస్ నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. ఆమెపై ఎవరైనా తీవ్ర ఆరోపణలు చేస్తే.. ఆ తర్వాత గట్టిగా స్పందిస్తున్నారు. దాంతో విషయం పెద్దదైపోతోంది. అటెన్షన్ కోసం అలా చేస్తున్నారని పైకి చెబుతున్నా….కవిత చేసే రాజకీయం తమ పుట్టి ఎక్కడ ముంచుతుందో అని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
