తెలంగాణ రాజకీయాల్లో కవిత కన్నీరు ఓ సంచలనం అనుకోవచ్చు. రాజీనామా చేసిన ఆమె మండలికి రావాలని అనుకోలేదు. కానీ ప్రత్యేకంగా వచ్చి సమయం తీసుకుని తన బాధ అంతా వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకోలేదు. అదే సమయంలో ఆ కన్నీటి సాక్షిగా తాను రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని చాలెంజ్ చేశారు. కుటుంబంతో అన్ని బంధాలు తెంచుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు కవిత త్యాగానికి, కన్నీటికి ఎంత విలువ ఉంటుంది.. రాజకీయంగా ఈ కన్నీరు ఎంత మేర ఆమెకు ప్రజల మద్దతు లభించేలా చేస్తాయన్నదే ఇప్పుడు కీలక అంశం.
కవిత ఇక సంపూర్ణంగా స్వతంత్ర నేత
కల్వకుంట్ల కవిత ఇప్పుడు సంపూర్ణంగా స్వతంత్ర నేత. తాను కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు . చాలా మందికి ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా కల్వకుంట్ల కుటుంబం అంతా కలసి పోతుందని అనుకుంటూ వస్తున్నారు. అలాంటి అవకాశమే లేదని కవిత తేల్చేశారు. తన సొంత రాజకీయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆమె కేసీఆర్ ను గౌరవించేవారు. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫోటో లేకుండా జాగృతిని నడుపుతున్నారు. ఇక ముందు కేసీఆర్ పేరు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండదు.
కవిత కన్నీళ్లు ఇక చాలా చోట్ల చూడొచ్చు !
రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఆశనో లేకపోతే కుటుంబంలో తనపై చూపిన వివక్షనో.. మరో కారణమో కానీ కవిత బయటకు వచ్చేశారు. ఇక బీఆర్ఎస్ లో ఆమె కలిసే అవకాశం లేదు. సొంత రాజకీయాలు చేయాలని డిసైడయ్యారు. ఇప్పుడు ఆమె బలంగా నిలబడాలంటే ఉండాల్సింది ప్రజల మద్దతు. కవిత తనపై సానుభూతి చూపించాలనేలా పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగారు. రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఉండదు. ఆ అస్త్రాన్ని వ్యూహాత్మకంగా ప్రయోగించారు. కుటుంబంలో ఒంటరిని చేశారని.. బయటకు గెంటేశారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇక ముందు ఆమె చాలా చోట్ల కన్నీరు పెట్టుకునే అవకాశాలు ఉండవచ్చు. అయితే ప్రజలు ఎలా స్పందిస్తారన్నదే కీలకం.
కవిత ప్రభావం ఎంత పెరిగితే బీఆర్ఎస్కు అంత ముప్పు
ఇప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కవిత గెలవకపోచ్చు కానీ.. బీఆర్ఎస్ ను మాత్రం ఖచ్చితంగా ఓడించగలరు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో రెండు, మూడు శాతం ఓట్లు చీల్చినా బీఆర్ఎస్ కు జరిగే నష్టం అంచనా వేయడం చాలా కష్టం. పంచాయతీ ఎన్నికలనే తీసుకుంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా నష్టపోయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయమే. కవిత చాలా సీరియస్ గా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆమె రాజకీయాలుఎంత క్లిక్ అయితే.. బీఆర్ఎస్ పార్టీ విజయానికి అంత దూరమవుతూ ఉంటుంది. కవిత తనను అవమానించిన బీఆర్ఎస్ పార్టీపై పగ తీర్చుకోవడం వరకూ సక్సెస్ అవుతారు. తాను గెలవడం..లేదా కింగ్ మేకర్ అవడం అన్నది మాత్రం ముందు ముందు జరిగే రాజకీయ పరిణామాల బట్టి ఉండవచ్చు.
