శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గత ఎనిమిదేళ్లుగా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల గొంతుకగా చేస్తున్న ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. నిజాయితీగా పని చేస్తున్న తనను ప్రోత్సహించాల్సింది పోయి, గొంతు నొక్కే ప్రయత్నం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో తనపై జరిగిన వివక్షను తలచుకుని ఆమె కంటతడి పెట్టుకున్నారు.
కేసీఆర్ పై కోపంతోనే తనను బీజేపీ జైలుకుపంపిందన్నారు. అయినా తన స్వంత పార్టీకి చెందిన మీడియా సంస్థల నుంచి తనకు కనీస మద్దతు లభించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం పని చేసే పత్రికలు, ఛానెళ్లు తన పోరాటాన్ని ఎప్పుడూ గుర్తించలేదని, పైగా తనపై దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. లోపాలను ఎత్తిచూపినందుకు, పార్టీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని, ఆ కక్షతోనే చివరకు తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు కూడా తాను అంగీకరించలేదన్నారు. నైతికత లేని బీఆర్ఎస్కు దూరమైనందుకు తాను సంతోషిస్తున్నానని కవిత స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని కవిత ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం నుంచి మొదలుపెడితే, అమరజ్యోతి వరకు ప్రతి పనిలోనూ అవినీతి అక్రమాలు జరిగాయి అని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులను, ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించే వారిని ప్రస్తుత పాలకులు వివక్షకు గురిచేస్తున్నారని, వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు. తన ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చేసి చెబుతున్నా..తనది ఆస్తుల పంచాయతీ కాదని.. ఆత్మగౌరవ పంచాయతీనేనన్నారు.
తనను పార్టీ నుంచి పంపించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతానని కవిత స్పష్టం చేశారు. కేవలం ప్రశ్నించినందుకే ఒక ప్రజాప్రతినిధిని వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అధికారం చేతిలో ఉందని అణచివేతకు పాల్పడటం సరికాదన్నారు. నైతికత లేని పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉండదల్చుకోలేదని అందుకే తన రాజీనామా ఆమోదించాలని చైర్మన్‌ను కోరారు. భావోద్వేగంతో సాగిన ఆమె ప్రసంగం మండలిలో ఉన్న సభ్యులందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. తన ప్రసంగం మొత్తం దాదాపుగా ఆమె కన్నీరు తుడుచుకుంటూనే ప్రసంగించారు.
కవిత ప్రసంగం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే సాగింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
