కల్వకుంట్ల కవిత తన తండ్రి స్థాపించిన పార్టీ అస్తిత్వాన్నే సవాల్ చేసే స్థాయికి వెళ్లారు. టీఆర్ఎస్ అనే బ్రాండ్‌ను ఆమె సొంతం చేసుకోవాలని నిర్ణయించారు. అదే పేరుతో పార్టీ పెట్టారు. భావజాలం కూడా అదే. ఇప్పుడు కవితను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలన్నది కేసీఆర్, కేటీఆర్‌లకు పెద్ద సవాల్ .
టార్గెట్ చేసి విమర్శలు చేస్తే ఓ సమస్య
కేసీఆర్ , కేటీఆర్ బహిరంగంగా కవిత తీరును విమర్శిస్తే, అది ఆమెకు రాజకీయంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆమె వెంటనే దానిని బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటంగా మార్చేస్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసిన బీఆర్ఎస్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ అని ఆమె ప్రచారం చేస్తారు. ఈ పంచాయతీ వీధికి ఎక్కితే, అది పార్టీ కేడర్‌ను పూర్తిగా అయోమయంలోకి నెట్టేస్తుంది. అంతిమంగా అది ప్రజలకు సంబంధం లేని కుటుంబ పోరుగా మారిపోతుంది. క్యాడర్ రెండుగా చీలిపోతుంది.
మౌనంగా ఉంటే క్యాడర్ మాయం
అలాగని కవితను ఏమీ అనకుండా వదిలేస్తే.. ఆమె బీఆర్ఎస్లోని అసంతృప్త నేతలను, పాత టీఆర్ఎస్ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే పార్టీ నుంచి వలసలు సాగుతున్న తరుణంలో, కవిత తన తండ్రి పాత ఇమేజ్ను వాడుకుని అసలైన వారసురాలిని నేనే అని చెప్పుకుంటే, కింది స్థాయి క్యాడర్ ఆమె వైపు వెళ్లే అవకాశం ఉంది. గట్టిగా విమర్శించినా నష్టమే, పట్టించుకోకపోయినా నష్టమే అన్నట్లుగా బీఆర్ఎస్ అగ్రనేతల పరిస్థితి తయారైంది.
ఉనికిని కాపాడుకోవడమే అసలు లక్ష్యం
బీఆర్ఎస్ నేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే.. రాష్ట్రంలో బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే వారిని మూడో స్థానానికి నెట్టేశాయి. ఈ తరుణంలో కవిత రూపంలో కొత్త కుటుంబ సవాల్ ఎదురవ్వడం పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఆమె టీఆర్ఎస్ ఐడెంటిటీని లాగేసుకోవడం వల్ల, కేసీఆర్ దశాబ్దాల పాటు నిర్మించిన తెలంగాణ బ్రాండ్ ఆయన చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కవితను డీల్ చేయడంలో బీఆర్ఎస్ నాయకత్వం ఒక రకమైన చెక్-మేట్ పొజిషన్లో ఉంది. కేసీఆర్ చాణక్యం ఈ మధ్య పని చేయడం లేదు. అదే పని చేస్తే కవితను బుజ్జగించి పార్టీలోనే ఉండేలా చేసేవారు.
