నైనీ కోల్ బ్లాక్ టెండర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కొత్త కోణం ఆవిష్కరించారు. చిన్న చేప పిల్లని పట్టుకున్నట్లు చేసి, వెనుక ఉన్న పెద్ద తిమింగలాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆమె హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆరోపించారు. ముఖ్యంగా మెఘా కృష్ణా రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమే, ఈ మొత్తం వ్యవహారాన్ని సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతూ అసలు దోషులను పక్కదారి పట్టిస్తున్నారని హరీష్ రావుపై ఆరోపణలు గుప్పించారు. టెండర్ల రద్దు వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని, దానిని కప్పిపుచ్చేందుకే ఇదంతా చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు.
హరీష్ రావును ఉద్దేశించి గుంట నక్క అంటూ అత్యంత కఠినమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. స్వార్థ రాజకీయాల కోసం హరీష్ రావు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని, ఆయన వేస్తున్న కుయుక్తులను గమనించకుండా కేటీఆర్ గారు గుడ్డిగా ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. ఈ కోల్ బ్లాక్ వివాదంలో వాస్తవాలు బయటకు రావాలని, ఎవరో చెప్పిన మాటలు విని తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆమె పార్టీ నేతలకు సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని హితవు పలికారు.
హరీష్ రావే .. ఈ వ్యవహారాన్ని సృజన్ రెడ్డికే పరిమితం చేస్తున్నారని మేఘా కృష్ణారెడ్డి వద్దకు వెళ్లకుండా ఆయనే డైవర్షన్ చేస్తున్నారని కవిత అభిప్రాయం. ఇటీవలి కాలంలో హరీష్ రావుపై కవిత తరచూ విమర్శలు చేస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే కోణం తీసుకున్నారు. తన పార్టీ పేరు జాగృతి అని ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. కవిత పార్టీలో చేరికపై తరచూ కామెంట్స్ చేస్తున్న టీపీసీసీ చీఫ్‌కు కూడా కౌంటర్ ఇచ్చారు. తన పార్టీలోకి వస్తే మంచి పోస్టు ఇస్తానన్నారు.
