అబ్బ! కేసీఆర్ ఎంత బాగా చెప్పారు!

మాటల మాంత్రికుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనినయినా తనకు అనుకూలంగా వర్తింపజేసుకొని ప్రజల మనసులకు హత్తుకుపోయేలా చెప్పగలరు. ఆయన నందిని పట్టుకొని పందని వాదించగలరు. పందిని పట్టుకొని నందని వాదించి నిరూపించగల సమర్ధులు. ఆయన అలాగ వాదిస్తే ఎవరూ కాదనలేరు కూడా.

తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కొత్తలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెదేపాను కనబడకుండా తుడిచి పెట్టేస్తామని చెప్పారు. అప్పటి నుండి ఆయన అదే పని మీద ఉన్నారు కూడా. తాజాగా తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుని, కాంగ్రెస్ సీనియర్ నేత బసవరాజు సారయ్యని తెరాసలో చేర్చుకొన్నారు. ఈ విధంగా ప్రతిపక్షాలను బలహీనపరిచి తెలంగాణాలో తెరాసకు ఎదురులేకుండా చేసుకోవాలనే ఆలోచన ప్రజాస్వామ్య లక్షణం కాదు. కానీ ఆయన దానికి ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అని చాలా అందమయిన పేరు తగిలించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలు సంతోషంగా లేరని, ఏ ప్రాంతము అభివృద్ధి జరుగలేదని దాని వలన ప్రజలే చాలా నష్టపోయారని అన్నారు. అందుకే తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ చాలా అవసరం పడిందని అన్నారు. కనుక ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరికను కేవలం ఫక్తు రాజకీయ చేరికగానో లేదా చిల్లర రాజకీయలుగానో చూడరాదని, తెలంగాణా అభివృద్ధి కోసం జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగంగానే చూడాలని అన్నారు. వివిద పార్టీల నేతలందరూ తెలంగాణా అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నారని కేసీఆర్ చెప్పారు.

ఒక తప్పుని ఇంత గొప్పగా ఒప్పు అని నిరూపించడం కేవలం ఆయనకే చెల్లు అని చెప్పవచ్చును. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలో ఏ వర్గానికి, ప్రాంతానికి న్యాయం జరగలేదని చెపుతున్న కేసీఆర్ దానికి గత ప్రభుత్వాలే కారణమని ఆరోపించడం అందరికీ తెలుసు. మరి ఆ ప్రభుత్వాలలో సరిగ్గా పనిచేయనివారిని, తెలంగాణాకు న్యాయం చేయని వారినే ఆయన తెరాసలో ఎందుకు చేర్చుకొంటున్నట్లు? అప్పుడు తెలంగాణాని దోచుకోన్నవారు ఇప్పుడు తెరాసలో చేరినంత మాత్రాన్న నీతిమంతులు అయిపోతారా? లేక తెలంగాణా అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తారా? అలాగ చేసే ఉద్దేశ్యమే వారికి ఉండి ఉంటే వారు కాంగ్రెస్ పార్టీ, తెదేపాలలో ఉన్నప్పుడే చేసి ఉండేవారు. అప్పుడు రాష్ట్ర విభజన అవసరమయ్యి ఉండేదే కాదు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి, పార్టీకి, కులానికి చెందిన రాజకీయ నేతలు అధికారంలో ఉన్నా అందరూ తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేరు తప్ప రాష్ట్రాన్ని అభివృది చేయాలని, ప్రజలకు సేవ చేయాలని అనుకోలేదు. అందుకే నేటికీ ఆంధ్రాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. మరి అటువంటి నేతల్ని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకొని తెలంగాణాని అభివృద్ధి చేస్తానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వారిని చేర్చుకోవడం వలన తెలంగాణా అభివృద్ధి అయిపోదని అందరికీ తెలుసు. కేసీఆర్ తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీల నేతల్ని తెరాసలో ఎందుకు చేర్చుకొంటున్నారంటే ఇక తెలంగాణాలో తన అధికారానికి తిరుగు ఉండకూడదనే. తన తరువాత తన కొడుకు కె.టి.ఆర్. పట్టాభిషేకానికి ఎవరూ అడ్డుపడకూడదనే కావచ్చును.

కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు ఎన్నడూ సఫలం కాలేదు. ఒకవేళ సఫలం అయినా అవి ఏదో కొంత కాలం వరకు మాత్రమే సాగాయి. కేంద్రంలో అధికారం చెలాయించిన నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని గమనించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది. రాహుల్ గాంధిని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని సోనియా గాంధీ ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అందుకోసం ఆమె సిబిఐని దుర్వినియోగం చేసారు. బలంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసారు. అయినా ఆమె తన ప్రయత్నాలలో సఫలం కాలేకపోయారు. యావత్ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. కనుక కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరికీ కూడా అదే సూత్రం వర్తిస్తుందని చెప్పక తప్పదు. అయితే ప్రస్తుతం వారిద్దరూ అధికారంలో ఉన్నారు కనుక వారు చెప్పిందే వేదంగా చెలామణి అవవచ్చును కానీ ఎన్నికలోస్తే ప్రజాస్వామ్య వేదం ముందు ఈ ప్రాంతీయ వేదాలు పనిచేయవు.

అయితే కేసీఆర్ కనిపెట్టిన ఈ ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అనే అందమయిన పదం, చంద్రబాబు నాయుడుకి కూడా వాడుకోవడానికి చాలా చక్కగా పనికి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రేరణతోనే ఆయన ఆంద్రాలో వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ పనిలో పడ్డారు కదా అందుకు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com