చంద్రబాబు ఇంటికొచ్చి కొట్టి పోతానంటున్నాడు..! కొట్టించుకుందామా.. ? : కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ కలసి పోటీ చేయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త అర్థం చెప్పారు. ఆ రెండు పార్టీలు పెట్టుకున్నది పొత్తు కాదన్నారు. పొత్తు ద్వారా … తెలంగాణలో అడుగు పెట్టి… చంద్రబాబు.. మీ ఇంటికే వచ్చి కొట్టి పోతా అంటున్నారని విశ్లేషించారు. ఊరుకుందామా..బుద్ధి చెబుదామా?… అంటూ ప్రజలనే ప్రశ్నించారు. చంద్రబాబును నిలదీసి అడగాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌: జడ్చర్లలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. గతంలో జడ్చర్ల టీడీపీ బలమైన నియోజకవర్గంగా ఉండేది. ఆయితే ఈ సారి అక్కడ కాంగ్రెస్ తరపున మల్లు రవి పోటీ చేస్తున్నారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, మక్తల్ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. అందుకే ఆ జిల్లాలో టీడీపీని టార్గెట్ చేశారు కేసీఆర్.

పాత పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని.. అందుకే జిల్లాలో వలసలు తగ్గిపోయాయన్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను తాము వచ్చిన తర్వాతే పూర్తి చేశామని నాలుగేళ్లలో ఇంతటి ఫలితం సాధించడం అపూర్వమని తనకు తాను కితాబిచ్చుకున్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటానన్న చంద్రబాబు వలసల జిల్లాగా మార్చేశారని మండిపడ్డాు. టీడీపీ వస్తే ప్రాజెక్టులు పూర్తి కావు..నీళ్లు రావని హెచ్చరించారు. సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే భవిష్యత్ నాశనమేనన్నారు. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రశ్నించారు. దుర్మార్గులు చొరబడి మనల్ని …. రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటున్నారని… జాగ్రత్త పడాల్సిన సమయం ఇదని జాగ్రత్త చెప్పారు. మరో పోరాటం చేయాల్సిన సమయ వచ్చిందన్నారు.

కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కన్నా.. టీడీపీనే ఎక్కువగా.. అదీ కూడా చంద్రబాబునే గురి పెడుతున్నారు. టీడీపీకి ఓటేస్తే ఏదో జరిగిపోబోతోందన్న… భావన కల్పించడానికి తన మాటకారి తనాన్ని అంతా ప్రయోగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తూండటంతో అక్కడ అదే చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ అదే చేశారు. తెలుగుదేశం పార్టీ ఉన్న చోట… సెంటిమెంట్ ను పెంచేందుకు కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం ఊపందుకుంటూండటంతో… వ్యూహాల్ని కేసీఆర్ .. చాలా వేగంగా మార్చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.