మాటంటే మాటేనంటా…ఆర్టీసీ యూనియన్లు క్లోజంట…!

‘ఏప్రిల్‌ 1 విడుదల’ సినిమాలో ‘మాటంటే మాటేనంటా…కంటబడ్డ నిజమంతా అంటా’ అని రాజేంద్ర ప్రసాద్‌ ఓ పాట పాడతాడు. అదే మాదిరిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ‘మాటంటే మాటేనంటా…ఆర్టీసీ యూనియన్లు క్లోజంట’ అని పాడుతున్నాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టగానే యూనియన్లపై నిప్పులు చెరిగాడు. యూనియన్‌ నాయకులు మాటలు విని కార్మికులు మునుగుతున్నారని అన్నాడు. సమ్మె జరుగుతున్న కాలంలో సమీక్షల మీద సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌ ప్రతిసారి యూనియన్ల మీద విరుచుకుపడ్డాడు. యూనియన్లు ఉండొద్దనే తన ఆకాంక్షను పబ్లిగ్గానే తెగేసి చెప్పాడు. తనకు యూనియన్లంటే ఎంత అసహ్యమో పలుమార్లు బయటపెట్టాడు. నిన్న కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు కూడా యూనియన్లపై ఇంతెత్తున లేచాడు.

‘యూనియన్లను నేను ఎట్టి పరిస్థితిలోనూ సంప్రదించేది లేదు. వారిని ప్రగతి భవన్‌కు రానిచ్చే ప్రసక్తే లేదు. ఇంత చెడగొట్టి, ఇంత నాశనం చేసినవాళ్లను కార్మికుల బతుకులు బజారున పడేసిన వాళ్లను, కార్మికుల మృతికి కారకులైనవాళ్లను మేం క్షమించదల్చుకోలేదు. నేను చెప్పిన మాట వింటే బాగుపడ్తరు. ఏ యూనియన్‌ సహాయం చేయదు’…అని చెప్పాడు. తాను ‘వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌’ పెడతానని అన్నాడు. ‘వారం రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచి అయిదుగురు కార్మికులను హైదరాబాదుకు పిలుస్తా. నేనే స్వయంగా మాట్లాడతా’ అని చెప్పాడు కేసీఆర్‌.

కాని ఆయన వారం దాకా ఆగదల్చుకోలేదు. ఆదివారమే అంటే డిసెంబరు ఒకటో తేదీనే కార్మికులతో సమావేశమవుతానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాడు. ఇక ఆర్టీసీలో యూనియన్లు ఉండకూడదనే కేసీఆర్‌ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తున్నారు అధికారులు. కార్మికులు విధుల్లో చేరి 24 గంటలు గడవకముందే నడుం బిగించారు. హైదరాబాదులోని బస్‌ భవన్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) ఆఫీసుకు తాళం వేసేశారు. అంతేకాదు, ఆ కార్యాలయాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతటితో ఊరుకోలేదు. ఆర్టీసీ యూనియన్ల నాయకులకు ఉన్న రిలీఫ్‌ డ్యూటీ సౌకర్యాన్ని రద్దు చేశారు. ఇక నాయకులకు రిలీఫ్‌ డ్యూటీలనేవి ఉండవు.

యూనియన్‌ నాయకులకు కార్మికులకు సంబంధించి రకరకాల పనులుంటాయి కాబట్టి ఆ పనుల సమయంలో వారు విధులకు హాజరు కాకుండా మినహాయింపు ఇస్తారు. దీన్నే రిలీఫ్‌ డ్యూటీ అంటారు. దీంతో నాయకులు డ్యూటీకి రాకపోయినా జీతంలో కోత ఉండకపోయేది. కాని రిలీఫ్‌ డ్యూటీ రద్దు చేశారు కాబట్టి డ్యూటీకి రాకపోతే జీతం కోసేస్తారు. ఈ చర్యతోనే నాయకుల కోరలు పీకినట్లయింది. ముందు ముందు ఇంకేం రద్దు చేస్తారో. ఇంకేేం నిబంధనలు పెడతారో…! యూనియన్లు ఉండకూడదన్న కేసీఆర్‌ అభిప్రాయంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు.

యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం, నడిపించడం రాజ్యాంగం కల్పించిన హక్కంటున్నారు. ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేయడం కేసీఆర్‌ తరం కాదని, ఆర్టీసీ ఉన్నంతవరకు యూనియన్లు ఉంటాయని జేఏసీ కన్వీనర్‌ అశ్వద్థామ రెడ్డి అన్నాడు. టీఆర్‌ఎస్‌ కూడా కార్మిక విభాగం ఉంది. దాన్నేం చేస్తారని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు. కొంతకాలం కిందట టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ పరిశ్రమలో గుర్తింపు యూనియన్‌ కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంటుగా గెలిచాడు. గతంలో టీఆర్‌ఎస్‌కు చెందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజెకేఎస్‌) సింగరేణి ఎన్నికల్లో గెలిచింది. అప్పట్లో కేసీఆర్‌ సంబరాలు చేసుకున్నాడు.

కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘానికి, తెలంగాణ అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌కు గౌరవాధ్యక్షురాలిగా పనిచేసింది. సింగరేణి ఎన్నికల్లో ఆమె ప్రచారం కూడా చేసింది. ఇక మంత్రి హరీష్‌రావు గతంలో ఆర్‌టీసీలోని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆర్టీసీలో యూనియన్లు వద్దంటున్న కేసీఆర్‌ ఇతర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉన్న యూనియన్లను ఏం చేస్తారో చెప్పలేదు. మొత్తం మీద ఆర్టీసీని ‘నీ భరతం పడతా చూడు’ అంటూ కేసీఆర్‌ వెంటాడుతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` అలాంటి క‌న్‌ఫ్యూజ్...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

HOT NEWS

[X] Close
[X] Close