కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ఒక రాయి విసిరారు..!

తెలంగాణ‌లో కాంగ్రెస్, టీడీపీల మ‌ధ్య పొత్తు ఉంటుందా అనే చ‌ర్చ ఈ మ‌ధ్య తీవ్రంగానే జ‌రుగుతోంది. ఎలాగూ అసెంబ్లీ ర‌ద్ద‌యిపోయింది కాబ‌ట్టి, కాంగ్రెస్ కూడా ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుని వెళ్లే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టేస్తుంది. అయితే, టీడీపీతో పొత్తు అంశ‌మై టి. కాంగ్రెస్ నేత‌ల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్న నేప‌థ్యంలో… దాన్ని మొగ్గ‌లోనే తుంచేయాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంలా క‌నిపిస్తోంది! రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక గొడుగు కింద‌కి వ‌స్తాయ‌న్న అభిప్రాయానికే ఆయ‌న ఆస్కారం ఇవ్వ‌లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసి తెరాస‌పై పోటీకి దిగుతాయి క‌దా అనే ప్ర‌శ్న‌కు కేసీఆర్ స‌మాధానం చెబుతూ… వంద స్థానాల్లో యాభై శాతానికి పైగా ఓట్లు త‌మ‌కు ప‌డుతూ ఉన్న‌ప్పుడు, ఎవ‌రితో ఎవ‌రు క‌లిస్తే త‌న‌కేంటి అన్నారు.

కానీ, టీడీపీ కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు కుదిరే అంశమై జ‌రుగుతున్న చ‌ర్చ దగ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి మ‌రోలా కేసీఆర్ స్పందించారు. తెలంగాణ‌కు సంబంధించిన విల‌న్ అంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అనీ, అలాంటి పార్టీతో టీడీపీ పొత్తు అంటే… దాన్లో నైతిక‌త ఎక్క‌డ ఉంటుందీ, అంత‌కంటే దిగ‌జారుడు రాజ‌కీయం ఇంకేదైనా ఉంటుందా.. అంటూ ఓ ప్ర‌శ్నను కేసీఆర్ లేవ‌నెత్తారు..? నిజానికి, ఈ వ్యాఖ్య వెన‌క కేసీఆర్ ఉద్దేశం కూడా ఇలాంటి చ‌ర్చ జ‌ర‌గాల‌న్న‌దే ఉద్దేశంగా క‌నిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం మనుగడ దృష్ట్యా కావొచ్చు, వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఒడిసిప‌ట్టాల‌న్న కాంగ్రెస్ వ్యూహం ప్ర‌కారం కావొచ్చు… ఈ రెండు పార్టీలూ ద‌గ్గ‌ర‌య్యేందుకు అవ‌కాశం క‌ల్పించే ఒక సానుకూల చ‌ర్చ ఈ మ‌ధ్య జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే, కేసీఆర్ తాజా వ్యాఖ్య‌ల‌తో ఆ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టే అవుతుంది.

స‌గ‌టు తెలుగుదేశం పార్టీ అభిమాని మీద ఈ వ్యాఖ్య‌ల ప్ర‌భావం ఎంతో కొంత ఉంటుంద‌నే చెప్పొచ్చు. కాంగ్రెస్ తో పొత్తుకి వెళ్లి ప‌రువు పోగొట్టుకునే బ‌దులు… ఐదో ప‌దో స్థానాల‌ను సొంతంగా గెలుచుకుంటే మేలు అనే అభిప్రాయం వైపు ఆలోచింప‌జేసే విధంగా కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించారనే అన‌డంలో సందేహం లేదు. కాంగ్రెస్ తో క‌లిసి వెళ్తే 2019లో ఉప‌యోగం ఉంటుందో లేదో తెలీదుగానీ, దీని వ‌ల్ల రాష్ట్రంలో పార్టీపై నెగెటివ్ ఇమేజ్ వ‌చ్చేస్తుందేమో అనే ఒక ఆందోళ‌న‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో కేసీఆర్ క‌లిగించే ప్ర‌య‌త్నం చేసేశార‌నే చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com