హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కలిసి మెలసి సాగుతుండగా హైదరాబాద్లోని తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు విభేదాలెందుకని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఫేజ్ 4లో 630 మంది లబ్దిదారులకు ప్రభుత్వం నిర్మించిన నూతన ఎల్ఐజీ గృహాలను పంపిణీ చేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ, సీమాంధ్రవాసుల మధ్య రాజకీయ విభేదాలు కొంతమంది సృష్టిస్తున్నారని తలసాని అన్నారు. కేసీఆర్, చంద్రబాబే కలిసిపోతే మనమధ్య రాజకీయాలెందుకని వ్యాఖ్యానించారు. కేసీఆర్, చంద్రబాబు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని, ఇప్పుడు మంచి వాతావరణం ఉందని చెప్పారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందరి సహాయ సహకారాలు అవసరమని అన్నారు. రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో సీమాంధ్రవాసులకు కూడా టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. సీమాంధ్రవాసులు కూడా పోటీచేసి, నగరాన్ని అభివృద్ధి చేయటానికి కలసిరావాలని తలసాని పిలుపునిచ్చారు.