అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావును నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభల్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లయింది.
శాసనసభలో హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలాసాని శ్రీనివాస్ యాదవ్ లకు కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చను నడిపించనున్నారు. శాసనమండలిలో ఎల్. రమణతో పాటు పి. సతీష్ రెడ్డిని ఉప నేతలుగా ఎంపిక చేశారు. సభ్యులను సమన్వయం చేసేందుకు దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు.
అసెంబ్లీలో సబిత, తలసానికికూడా డిప్యూటీ లీడర్ హోదా ఇచ్చినప్పటి హరీష్ రావు మాత్రమే అధికారపక్షాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోనున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ నియామకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలోనూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని హరీష్ రావే ఎదుర్కొన్నారు. కేటీఆర్ ఎక్కువగా జోక్యం చేసుకునేవారు కాదు. ఈ సారి నేరుగా హరీష్ రంగంలోకి వస్తున్నారు.