జూబ్లిహిల్స్ ఉపఎన్నిక బాధ్యతను కేటీఆర్కు ఇస్తున్నట్లుగా పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారు. శుక్రవారం రోజు పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ నిర్వహించారు. పార్టీకి సవాళ్లుగా మారిన అంశాలపై ఏం చేయాలన్నదానిపై చర్చించారు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కూడా జరిగే అవకాశం ఉన్నందున సన్నాహాలు ప్రారంభించాలని కేసీఆర్ ..కేటీఆర్కు సూచించారు.
అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు ఇతర అంశాలన్నింటినీ కేటీఆరే చూసుకోనున్నారు. జూబ్లిహిల్స్ లో బీఆర్ఎస్ కు పలువురు అభ్యర్థులు రెడీగా ఉన్నారు. సానుభూతి పవనాలు పని చేయాలనుకుంటే మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయినా.. ఆమె సోదరికే టిక్కెట్ ఇచ్చినా ప్రజలు గెలిపించలేదు. సిటీ పరిధిలో.. సానుభూతి పవనాల గురించి ఆశలు పెట్టుకోలేమని కేటీఆర్ భావిస్తున్నారు.
జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే , పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. రేవంత్ తన సోదరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఆయన వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనతో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్నదానిపై కేటీఆర్ పరిశీలన చేయిస్తున్నారు. కాంగ్రెస్ తరపున అజహర్ బరిలో ఉండటం దాదాపు ఖాయమని భావిస్తున్నారు.
కేటీఆర్కు జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఓ సవాల్ లాంటిదే. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ఆయన ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ను పోటీలో ఉంచాల్సిన ఉంది. తేడా వస్తే..ఆయన నాయకత్వ సామర్థ్యంపై మరిన్ని విమర్శలు పెరుగుతాయి.