రెడ్డి సామాజికవర్గంపై కేసీఆర్ సర్కార్ కక్ష కట్టిందా?

హైదరాబాద్: తెలంగాణలో రెడ్డి సామాజికవర్గంవారిపై కేసీఆర్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దాడులు చేయిస్తోందని తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల ఒక పత్రికాసమావేశంలో ఆరోపించారు. రెడ్డి కులస్తులను రాజకీయాలకు దూరం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు దాడులకు ప్రోత్సహిస్తున్నారని, ఈ పరిస్థితులనుంచి బయటపడాలంటే పార్టీలకతీతంగా టీఆర్ఎస్‌పై పోరాటానికి సిద్ధంకావాలని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు రెడ్డి సామాజికవర్గం శాసనసభ్యులను టార్గెట్‌గా చేసుకున్నారని అన్నారు.

ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై కసిగా ఉన్నాడుకాబట్టి ఈ ఆరోపణలు చేశాడని తేలిగ్గా తీసిపారేయొచ్చుగానీ, రెడ్డి సామాజికవర్గంలోమాత్రం ఈ విషయంపై కొంతకాలంగా చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. తమ సామాజికవర్గాన్ని పక్కకు నెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారా అని వారు అనుమానిస్తున్నారు. దానికితోడుగా – ఇటీవల మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెంపదెబ్బ కొట్టిన ఘటన వారిలో ఆ భావనను మరింత బలపరిచి ఉంటుందనటంలో సందేహంలేదు.

తెలంగాణలో మొదటినుంచి రాజకీయపరంగా రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంటోంది. ఏ పార్టీలో చూసినా వారి సంఖ్యే అధికం. కేసీఆర్ సామాజికవర్గమైన వెలమకులం ఆర్థిక స్థితిగతులపరంగా బాగున్నప్పటికీ, సంఖ్యాపరంగా రెడ్ల స్థాయిలో లేరు. అయితే రెడ్లను కాదని ఏమీ చేయలేమనే ఉద్దేశ్యంతో కేసీఆర్ వారికి మంచి గౌరవం ఇచ్చినట్లు మంత్రిపదవులు ఇచ్చినప్పటికీ, వారికి అధికారాలుగానీ, గౌరవంగానీ ఆ స్థాయిలో లేవన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. దీనిపై మింగలేక కక్కలేక మంత్రివర్గంలోని పోచారం శ్రీనివాసరెడ్డివంటి రెడ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘గ్రామజ్యోతి’వంటి అనేక పథకాలు పంచాయతీరాజ్, ఐటీ శాఖలమంత్రి కేటీఆర్ అధీనంలోకి వెళ్ళిపోవటం తన పదవి అలంకారప్రాయంగా మిగిలిపోవటమే పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తికి కారణం. ఇక హోంమంత్రి నాయని నర్సింహారెడ్డికూడా ఇటీవల జరిగిన ఒక ఘటనతో గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. నాయని అల్లుడు ఇటీవల ఒక వివాదంలో ఇరుక్కున్నపుడు, హోం మంత్రి అనికూడా చూడకుండా అతనిపై పోలీసులు కేసు బుక్ చేయటంతో నాయని షాక్ తిన్నారట. ఇక ప్రభుత్వం బయటచూస్తే – రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో బుక్ చేయటం, వనపర్తిలో కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డిపై దాడి, అసెంబ్లీలో డీకే ఆరుణను అవమానించటంవంటి ఘటనలు ఉండనే ఉన్నాయి. ముఖ్యంగా చిట్టెంను బాలరాజు చెంపదెబ్బ కొట్టటం టీవీ ఛానల్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, టీఆర్ఎస్ అనుకూల మీడియా దానిని ఇరువురూ కొట్టుకున్నట్లు చిత్రీకరించటం రెడ్లలో అభద్రతా భావాన్ని రెచ్చగొట్టినట్లయింది.

మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం తమ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినాకూడా దానిని టీఆర్ఎస్‌లోని ఏ రెడ్డికూడా ఖండించకపోవటం గమనార్హం. సాధారణంగా ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేసిపుడు, సంబంధిత సామాజికవర్గానికి చెందిన తమ నాయకుడితో పార్టీలు ఖండన ప్రకటనలు ఇప్పిస్తాయి. ఇక్కడమాత్రం అలాంటి డేమేజ్ కంట్రోల్ ఎక్సర్‌సైజ్ జరగకపోవటాన్ని చూస్తే కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తేలిగ్గా తీసుకుందా, రెడ్డి సామాజికవర్గాన్ని తేలిగ్గా తీసుకుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com