కార్తీక దీపం సీరియల్లాగా సాగదీస్తున్నారు. ముందుకు సాగదు కానీ.. ఉత్కంఠగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన ప్రజెంటేషన్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో చాలా టెన్షన్ ఉంది. నిప్పులపై నిలబెట్టి అలా ఎంత సేపు ఉంచుతారని ఆయన వేదన పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏం చేస్తారో తెలియడం లేదని.. కానీ రాను రాను ఉక్కపోతను పెంచుకుంటూ పోతున్నారని వారికి అర్థమయింది. కేసీఆర్‌కూ ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేదు. రోజూ ఫామ్ హౌస్‌లో గంటల తరబడి పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఎలా ఎదురుదాడి చేయాలన్నదానిపై కసరత్తు జరుపుతున్నారు. కానీ ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నారు.
కమిషన్ రిపోర్టులు నిలబడవని చెప్పుకోవడం .. నిస్సహాయతే !
ఇందిరాగాంధీ, చంద్రబాబుపై గతంలో కమిషన్లు వేశారని… కానీ ఆ రిపోర్టులు చెల్లలేదని హరీష్ రావు చెప్పారు. నిజంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెల్లకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇంత టెన్షన్ పడాల్సిన పని లేదు. అసలు ఆ కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కమిషన్ కు నేరుగా అరెస్టుకు ఆదేశాలిచ్చే అధికారం ఉండదని చెబుతారు. కానీ కేసీఆర్ సహా పిలిచిన వారంతా విచారణకు హాజరయ్యారు. అంటే చట్ట పరిధిలో ఉన్నట్లే. కమిషన్ ఎవరు తప్పు చేశారో చెప్పింది కానీ.. ఫలానా చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. కమిషన్ పూర్తిగా న్యాయపరిధిలో తన పని పూర్తి చేసింది.
కమిషన్ రిపోర్టు కాదు.. సాక్ష్యలూ ఉండాలి.. ఉన్నాయి !
ఇందిరాగాంధీ, చంద్రబాబుపై వేసిన కమిషన్ల రిపోర్టుల వల్ల ఏమీ కాలేదని హరీష్ రావు అంటున్నారు. కానీ ఆ నేతలపై చేసిన ఆరోపణలు.. సాక్ష్యాలు చూపించలేకపోయారు. రాజకీయ ఆరోపణలతో ఆ కమిషన్లు వేశారు. చంద్రబాబుపై వైఎస్ వేసిన కమిషన్ల గురించి .. ప్రస్తుత తరానికి తెలియదు కానీ.. నాడు రాజకీయం చేసిన హరీష్ రావు, కేసీఆర్‌లకు తెలుసు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అలాంటిది కాదని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉన్నంత కాలం తమదే అధికారం అన్న ఓ గుడ్డి నమ్మకంతో కాళేశ్వరంను అడ్డగోలుగా నిర్మించారు. నిబంధనలకు ఉల్లంఘించారు. కేబినెట్ ఆమోదాలు లేవు. కేంద్ర సంస్థల నివేదికలు పట్టించుకోలేదు. నిపుణుల కమిటీ రిపోర్టులు చెత్తబుట్టలో వేశారు. కమిషన్ రాజకీయ ఆరోపణలతో ఈ వ్యాఖ్యలు చేయలేదు కదా..అన్ని ఆధారాలతోనే చేసింది.
ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్న కేసీఆర్
ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై కేసీఆర్ ఏమీ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. కక్ష సాధింపులని ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ రాజకీయ అరెస్టులు జరగలేదు. అరెస్టు చేస్తారని కుట్ర చేస్తున్నారని ఆరోపించలేకపోతున్నారు. అదే సమయంలో కాళేశ్వరం అద్భుతం అని చెప్పి ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. నమ్మి అధికారం ఇస్తే నట్టేటముంచారా అని ప్రజలు నిలదీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో తమను తాము కాపాడుకోవడానికి న్యాయపోరాటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతకు మించిన మార్గం లేదు. రాజకీయంగా మాత్రం ఎలా బయటపడాలో… అపరచాణక్యుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌కూ అర్థం కావడం లేదు. అలాంటి పద్మవ్యూహాన్ని రేవంత్ ఆయన చుట్టూ ఏర్పాటు చేశారు.