కేసీఆర్ అంటే అపరచాణక్యుడు. ఆయన మాట అంటే శాసనం. ఇలాంటి పరిస్థితుల్ని తెలంగాణ చూసింది. ప్రగతి భవన్ నుంచి బయటకు రాకుండా కను సైగలతోనే పాలనను శాసించారు. అలాంటి నాయకుడు ఇప్పుడు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. సొంత కుటుంబసభ్యులనూ సముదాయించలేకపోతున్నారు. రాజకీయం తన చేతుల్లో నుంచి జారిపోతున్నా.. నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జరిగేదేదో జరుగుతుందని వదిలేసినా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కుమార్తెకు సర్ది చెప్పలేకపోయారా ?
కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లారు. ఆ స్కాం నిజంగా చేశారా లేదా అన్న దాన్ని పక్కన పెడితే కేసీఆర్ ఈ అంశంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ పెట్టలేకపోయారు. కవితను జైలుకెళ్లి పరామర్శించలేకపోయారు. తనకు చెడ్డపేరు వస్తుందని.. ఆయన అనుకున్నారేమో కానీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అదే సమయంలో రాజకీయాల విషయంలో కవితకు సర్ది చెప్పలేకపోయారు. ఆమెకు పార్టీలో ఎలాంటి పాత్ర ఉంటుందో చెప్పి.. అంత వరకూ పరిమితమవ్వాలని సూచించలేకపోయారు. జాతీయ రాజకీయాలు చేసినప్పుడు కవిత.. కేసీఆర్ వెంటే ఉండేవారు. జాతీయ రాజకీయాలు ఫెయిలయ్యాక.. కవితను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కేటీఆర్ కు ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడే సమస్య వచ్చింది. సమస్య ఉందని తెలిసినా కేసీఆర్ .. కవితకు సర్ది చెప్పలేకపోయారు.
నిజంగానే ఇతరుల చేతుల్లో బందీగా ఉన్నారా ?
మీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి .. వాళ్లు చేస్తున్న పనుల గురించి తెలుసుకోండి నాన్నా అని కవిత దీనంగా ప్రెస్ మీట్లో విజ్ఞప్తి చేసుకున్నారు. ఆమె మాటల ప్రకారం కేసీఆర్ ఇప్పుడు కొంత మంది చేతుల్లో బందీలుగా ఉన్నారు. ముఖ్యనేతలు అంటూ ఆయన చుట్టూ ఉండే కొంత మంది మాత్రమే రాజకీయం చేస్తున్నారు. కవిత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చలు అంటూ మీడియా బ్రేకింకులు వచ్చాయి. రెండు, మూడు రోజుల నుంచి అవే బ్రేకింగులు. అంటే.. వీరందరి కోటరీలో కేసీఆర్ బందీ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు. సంతోష్ రావు లాంటి వాళ్లు పూర్తిగా కేసీఆర్ రోజువారీ వ్యవహారాల్ని గుప్పిట పట్టుకున్నారు. పరిస్థితులు చూస్తూంటే వీరందరి గుప్పిట్లో కేసీఆర్ ఉన్నారని సులువుగా అర్థమవుతుందని కొంత మంది బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
నాటి చాణక్యం ఏమయింది?
కేసీఆర్ ఇతర పార్టీలను చిన్నభిన్నం చేసే రాజకీయం చేశారు. చాలా పార్టీలు తట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు సొంత పార్టీ చిన్నాభిన్నం అవుతున్నా ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఇక్కడ రాజకీయం ఏమిటంటే.. బీఆర్ఎస్ ను ఇతర పార్టీలేవీ చిన్నాభిన్నం చేయడం లేదు. అంతర్గత సమస్యలతోనే ఆ పరిస్థితి వచ్చింది. వాటిని కూడా కేసీఆర్ చక్కదిద్దలేక.. ఏదయితే అదయిందని చూస్తూ ఉండిపోతున్నారు. కేసీఆర్ చాణక్యం అంతా.. గెలిచినప్పుడు మాత్రమే బయటకు వస్తోంది.. సమస్యలు వచ్చినప్పుడు ఎందుకూ పనికి రావడం లేదు.