గ్రేటర్ ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితికి కొరకరాని కొయ్యగా మారినట్టున్నాయి. హైకోర్టు తీర్పు ప్రకారం డిసెంబర్లో ఈ ఎన్నికలను పూర్తి చేయాలి. ప్రభుత్వం ఇందుకు సన్నాహాలు చేయగలిగినా, తెరాస మాత్రం సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు సీట్లను గెల్చుకున్న తెరాస, గత ఏడాదిగా పెద్దగా బలం పుంజుకోలేదనేది పలు మీడియా కథనాల సారాంశం.

కొందరు తెరాస నాయకులు కూడా ఆఫ్ ది రికార్డ్ గా ఈ విషయం ఒప్పుకుంటున్నారు. అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అంశాలపై బిజీగా ఉండటంతో నగరంపై ఎక్కువగా దృష్టి పెట్టలేదని చెప్తున్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి విద్యుత్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, హరిత హారం, వాటర్ గ్రిడ్, టీఎస్ ఐపాస్ తదితర అంశాలతో కేసీఆర్ బిజీగా ఉన్నారు.

దాంతో పాటు ఆపరేషన్  ఆకర్ష  ద్వారా వీలైనంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నాయకులను చేర్చుకునే ప్రయత్నం కొనసాగుతోంది. ప్రధానంగా, నగరంలో టీడీపీ బలం తగ్గలేదేమో అనే అనుమానంతో ఎన్నికలను వాయిదా వేస్తే బాగుండని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు, ఎన్నికలను డిసెంబర్లో నిర్వహించడానికి ఉన్న ఇబ్బందులను వివరిస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక విధంగా ఎన్నికలను కొన్నాళ్లు వాయిదా వేస్తే తెరాసను బలోపేతం చేసుకోవడం వీలవుతుందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

తెరాస నేతలు ఇంతగా ఆలోచించడానికి ఓ కారణం ఉంది. టీడీపీ, బీజేపీ కూటమి బలం తగ్గలేదనే అభిప్రాయం దీనికి ప్రధాన కారణం. 2009 నవంబర్లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకుంది. టీడీపీ 45 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. మజ్లిస్ పార్టీ 43 సీట్లు గెలిచింది. బీజేపీ 5, ఇతరులు 5 సీట్లు గెల్చుకున్నారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలో టీడీపీ విజయ దుందుభి మోగించింది. మజ్లిస్ కంటే ఒకటి ఎక్కువ, 8 సీట్లను గెల్చుకుంది. బీజేపీ 5 సీట్లను సాధించగా తెరాస 3 సీట్లకే పరిమితమైంది. 2009 గ్రేటర్ ఫలితాలు, మొన్నటి అసెంబ్లీ ఫలితాలను బట్టి, టీడీపీ బలాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అర్థమవుతోంది. అందుకే, ఎన్నికలను మరికాస్త వాయిదా వేసి కారును మరింత కండిషన్లోకి తేవాలని భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ను ఏరికోరి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చినా ఆయన వల్ల ఎంత బలం పెరిగిందనేది ఎన్నికల్లోనే తెలుస్తుంది.

సనత్ నగర్లోనే గెలుస్తాననే నమ్మకం లేదు కాబట్టే ఆయన రాజీనామా ఆమోదం పొందడం లేదని టీడీపీ వాదిస్తోంది. అయితే ఇది స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్, ఇతర నేతలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మేయర్ అభ్యర్థి విషయం చాలా సున్నితమైంది. నగరంలో పార్టీ బలోపేతానికి మైనంపల్లి హన్మంత రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు దానం వంటి వారిని పిలిచి పెత్తనం ఇస్తే గనక ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇన్ని చిక్కుముళ్ల నడుమ గ్రేటర్ ఎన్నికలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com