కేసీఆర్ – జగన్ ఫ్రెండ్‌షిప్..! వివాదాలకు పరిష్కార బాట..!

చంద్రబాబు పంతమో.. రాజకీయ ఆరాటమో కానీ… తెలంగాణ, ఏపీ మధ్య.. కొన్నాళ్లుగా… సంబంధాలు అంత గొప్పగా లేవు. అందుకే ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు.. జగన్‌ను.. కేసీఆర్ రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే… సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. వ్యతిరేకతతో కాకుండా.. సుహృద్భావ వాతావరణంలోనే.. ఎక్కువగా.. చర్చలు ఫలప్రదం అవుతాయి. ఆ పరిస్థితి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేపట్టక ముందే.. తెలంగాణతో ఏర్పాటు చేసుకున్నారు.

ఏపీకి కేసీఆర్ స్నేహస్తం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పేదిశగా సిఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నామని జగన్‌కు కేసీఆర్ చెప్పారు. స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి.. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై మాట్లాడానని గుర్తు చేశారు. సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చిందని .. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది తమ విధానమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దామని జగన్ తో కేసీఆర్ అన్నారు.

జలవివాదాలన్నీ పరిష్కారానికి ప్రయత్నం..!

గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టిఎంసిలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చునని కేసీఆర్‌ జగన్‌కు చెప్పారు. యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చని చెప్పారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.

ఉమ్మడి సంస్థల ఆస్తుల సంగతి కూడా తేల్చేస్తారా..?

ఒక్క నీటి సమస్య మాత్రమే కాదు.. చాలా ఉన్నాయి. ఉమ్మడి ఆస్తుల విభజన సహా…. పలు రకాల పంచాయతీలు ఉన్నాయి. వాటిని రెండు తెలుగు రాష్ట్రాలే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్రం చెబుతోంది. అయితే.. చంద్రబాబు హయాంలో.. చర్చలు జరపడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు.. జగన్… కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంతో.. అది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com